న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో దోషిగా తేలిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌కు బెయిల్ మంజూరు కావడంపై బాధితురాలి కుటుంబం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. మంగళవారం రాత్రి ఇండియా గేట్ వద్ద నిరసన తెలియజేసిన బాధితురాలు, ఆమె తల్లి.. బుధవారం ఉదయం మండి హౌస్ వద్ద ధర్నాకు ప్రయత్నించారు. దాంతో సీఆర్పీఎఫ్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు.
నిరసనకు పర్మిషన్ లేదని తమ బస్సులో ఎక్కాలని కోరారు. దానికి ఒప్పుకోకపోవడంతో బాధితురాలి తల్లిని సీఆర్పీఎఫ్ సిబ్బంది కొడుతూ, బలవంతంగా ఊడ్చుకెళ్లి బస్సులోకి ఎక్కించారు. అయినా ఆమె మండి హౌస్ వద్ద నిరసన చేసేందుకు బస్సు నుంచి కిందకు దిగే ప్రయత్నం చేసింది. దాంతో సీఆర్పీఎఫ్ సిబ్బంది ఆమెను కిందకు తోసేశారు. దాంతో ఆమె రోడ్డుపై పడిపోయింది.
దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం బాధితురాలి తల్లి మాట్లాడుతూ.."మాకు న్యాయం జరగలేదు. సీఆర్పీఎఫ్ సిబ్బంది నా కూతురును బలవంతంగా బస్సులో తీసుకెళ్లారు. కదులుతున్న బస్సులో నుంచి నన్ను తోసేశారు. మా కుటుంబానికి సెంగర్‌తో ప్రాణహాని ఉంది" అని పేర్కొన్నారు.
