చైర్మన్‌‌గా వీడిన బిర్లా!

చైర్మన్‌‌గా వీడిన బిర్లా!

నాన్‌‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పొజిషన్‌‌కూ రాజీనామా

బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: వొడాఫోన్ ఐడియా మేనేజ్‌‌మెంట్ బాధ్యతల నుంచి కుమార్‌‌‌‌ మంగళం బిర్లా తప్పుకున్నారు. కంపెనీ  చైర్మన్ పదవి నుంచి దిగిపోయారు. అంతేకాకుండా  బోర్డు నుంచి బయటకొచ్చేశారు. వీ బతకాలంటే ప్రభుత్వం సపోర్ట్ అవసరమని ఈ ఏడాది జూన్‌‌లో ప్రభుత్వానికి బిర్లా లెటర్ రాశారు. ఏజీఆర్ బకాయిల లెక్కింపుపై  కంపెనీలు చేసిన రిక్వెస్ట్‌‌ను సుప్రీం కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. దీని తర్వాత ప్రభుత్వ సాయాన్ని కోరుతూ లెటర్ రాశారు. వొడాఫోన్ ఐడియా నాన్ ఎగ్జిక్యూటివ్‌‌ చైర్మన్, నాన్ ఎగ్జిక్యూటివ్‌‌  డైరెక్టర్ పదవుల నుంచి బిర్లా తప్పుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఆదిత్య గ్రూప్  నామినేట్‌ చేసిన హిమాన్షు కపానియా వీ నాన్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ చైర్మన్‌‌గా నియమితులయ్యారు.  నాన్‌‌ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్‌‌‌‌గా సుశిల్‌‌ అగర్వాల్‌‌ నియమితులయ్యారు. 
2 నెలల క్రితమే ప్రభుత్వానికి ఆఫర్‌‌..
వీ  వొడాఫోన్ ఐడియా (వీ) లో తమ వాటాలను కొనండని ప్రభుత్వానికి  కుమార్‌‌‌‌ మంగళం బిర్లా ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ఇబ్బందుల్లో ఉన్న టెలికం సెక్టార్‌‌‌‌ కోసం మాత్రం త్వరలో ఓ రిలీఫ్ ప్యాకేజిని తీసుకురావాలని చూస్తోంది.  వీ లోని తన వాటాను ప్రభుత్వ కంపెనీలకు  అమ్మడానికి రెడీగా ఉన్నానని జూన్ 7 న ప్రభుత్వానికి బిర్లా లెటర్ రాశారు. ఈ  లెటర్ సోమవారం బయటపడింది.  బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌ కోసం రూ. 70 వేల కోట్ల ప్యాకేజిని రెడీ చేస్తున్నామని, వీ లో వాటాలు కొనే ఆలోచన ప్రభుత్వానికి లేదని  ఫైనాన్స్ మినిస్ట్రీ అధికారులు అంటున్నారు. బిర్లా లెటర్ చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. ‘ ఈ ప్రపోజల్‌‌ ప్రకారం వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వ కంపెనీ మైనార్టీ షేర్‌‌‌‌హోల్డర్‌‌‌‌గా మారాలి. యూకే కంపెనీ వొడాఫోన్,  వీ ని నడుపుతుంది’ అని పేర్కొన్నారు. ఈ ప్రపోజల్‌‌పై ఇప్పటివరకు  వొడాఫోన్‌‌ గ్రూప్ స్పందించలేదు.     ‘వీ నెట్‌‌వర్క్‌‌ను వాడుతున్న 27 కోట్ల మంది కస్టమర్లకు మేలు  జరగడం కోసం వీ లోని తమ వాటాను ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ కంపెనీకి అమ్మడానికి రెడీగా ఉన్నాము’ అని జూన్‌‌ 7 న కేబినెట్ సెక్రటరీ రాజివ్‌‌ గౌబాకు బిర్లా లెటర్ రాశారు. ఏజీఆర్ బకాయిలపై క్లారిటీ ఇవ్వాలని, స్పెక్ట్రమ్ పేమెంట్స్‌‌పై మారటోరియం, ఫ్లోర్ ప్రైస్‌‌ను మార్చడం వంటి విషయాలపై స్పష్టత కోరారు. 
కొత్తగా ఇన్వెస్ట్ చేయం..
ప్రస్తుతం వొడాఫోన్‌‌ ఐడియాలో ఆదిత్య బిర్లా గ్రూప్‌‌కు 27.66 శాతం వాటా, వొడాఫోన్‌‌ గ్రూప్ పీఎల్‌‌సీకి 44.39 శాతం వాటా ఉంది. ఇరు కంపెనీలు కూడా వీలో కొత్తగా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావడం లేదు. వీ లో వాటాలు కొనే ఆలోచన ప్రభుత్వానికి లేదని డాట్ అధికారులు చెబుతున్నారు. కానీ, మొత్తం టెలికం సెక్టార్‌‌కు రిలీఫ్ ఇచ్చేందుకు ఒక ప్యాకేజిని రెడీ చేస్తున్నామని అన్నారు. వచ్చే వారంలో  రిలీఫ్ ప్యాకేజి ప్రపోజల్‌‌ను ప్రభుత్వానికి డాట్ అందజేసే అవకాశం ఉంది. ఈ నెల చివరి నాటికి దీనిపై  ప్రకటన వెలువడనుంది. ‘ బ్యాంక్ గ్యారెంటీలను తగ్గించడం, లెవీలను రద్దు చేయడం, ఏజీఆర్ బకాయిల డెఫినిషన్‌‌లో కొంత వెసులుబాటు ఇవ్వడం వంటి అంశాలను రిలీఫ్ ప్యాకేజి కింద ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది’ అని ఈ విషయం తెలిసిన వ్యక్తులు పేర్కొన్నారు. కుమార్ మంగళం బిర్లా ప్రభుత్వానికి లెటర్‌‌‌‌ రాసిన నెలన్నర  తర్వాత అంటే జులై 23 న  వొడాఫోన్ గ్రూప్ సీఈఓ నిక్‌‌ రీడ్‌‌ స్పందించారు. ఇండియన్ టెలికం జాయింట్ వెంచర్ వొడాఫోన్ ఐడియా ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉందని వ్యాఖ్యానించారు. వొడాఫోన్ గ్రూప్ అదనంగా ఎటువంటి ఈక్విటీ సపోర్ట్‌‌ను అందించదని మాత్రం ఇంకోసారి స్పష్టం చేశారు. ‘ఒక గ్రూప్‌‌గా వొడాఫోన్ ఐడియాకు ప్రాక్టికల్ సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కానీ, అదనంగా ఇన్వెస్ట్ చేయలేము’ అని ఆయన పేర్కొన్నారు. కాగా, వొడాఫోన్‌‌, ఐడియా మెర్జింగ్ అయ్యాక ఒక్క క్వార్టర్లో కూడా  ఈ జాయింట్ వెంచర్‌‌‌‌ లాభాలను ప్రకటించలేదు. వొడాఫోన్ ఐడియా కస్టమర్ల బేస్‌‌ కూడా వేగంగా తగ్గుతోంది. కంపెనీ నెత్తిమీద రూ. 1.8 లక్షల కోట్ల అప్పు ఉంది. త్వరలో ఏజీఆర్ బకాయిలు, స్పెక్ట్రమ్‌‌ పేమెంట్స్‌‌, వడ్డీలను చెల్లించడానికి డేట్‌‌ దగ్గరపడుతోంది. వీటి కోసం రానున్న ఏడాదిలో  రూ. 23,500 కోట్లను కంపెనీ సేకరించాల్సి ఉంది. ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌‌‌‌లో కంపెనీకి రూ. 6,985.1 కోట్ల నష్టం వచ్చింది.

రెండు రోజుల్లో  29 శాతం డౌన్‌‌..
వొడాఫోన్ ఐడియా షేరు బుధవారం కూడా భారీగా నష్టపోయింది. టెలికం సెక్టార్ కోసం ప్రభుత్వం ఓ రిలీఫ్ ప్యాకేజిని తీసుకురానుందనే వార్తలు వచ్చినా కంపెనీ షేర్ల పతనం ఆగలేదు. వీ షేర్లు బుధవారం సెషన్‌‌లో 19 శాతం తగ్గి రూ. 5.95 వద్ద ఏడాది కనిష్టాన్ని టచ్ చేశాయి. బిర్లా చేసిన ఆఫర్‌‌‌‌ను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో  షేర్లు మరింత పడుతున్నాయి. ప్రభుత్వం తెచ్చే ప్యాకేజి వలన కూడా కంపెనీకి వెంటనే రిలీఫ్‌‌ దొరకదని ఇన్వెస్టర్లు అంచనావేస్తున్నారు.  మంగళవారం సెషన్‌‌లో కూడా వీ షేర్లు 10 శాతం మేర నష్టపోయాయి. వీ షేరు బుధవారం 18.92 శాతం తగ్గి రూ. 6 వద్ద క్లోజయ్యింది.

మూడు కంపెనీలుండాలి: ఎయిర్‌‌‌‌టెల్‌‌
ఇండియాలాంటి పెద్ద దేశంలో టెలికం సెక్టార్లో మూడు ప్రైవేట్ కంపెనీలు ఉండాలని ఎయిర్‌‌‌‌టెల్ సీఈఓ గోపాల్ విట్టల్‌‌ పేర్కొన్నారు. దీని కోసం ప్రభుత్వం రిలీఫ్ చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, వొడాఫోన్ ఐడియాను నడపడంలో వొడాఫోన్‌‌, ఆదిత్య బిర్లా గ్రూప్ చేతులెత్తేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనీ వ్యాఖ్యలు చేయడం విశేషం. ‘ఇండియాలాంటి దేశంలో మూడు టెలికం కంపెనీలు కేవలం బతకడమే కాదు, బాగా నడవాలి. ప్రభుత్వ కంపెనీ ఎప్పుడూ ఉంటుంది అది వేరే విషయం’ అని ఆయన అన్నారు. రానున్న 1-2 ఏళ్లలో టెలికం సెక్టార్ ఏ విధంగా మారుతుందనే ప్రశ్నకు ఆయన సమాధానంగా పై వ్యాఖ్యలు చేశారు. ‌‌ఆర్పూ తక్కువగా ఉందని, ఇది రూ. 300 లకు పెరగాలని చెప్పారు.