నిజాం పరిపాలనలో కుమ్రంభీం వీరోచిత పోరాటం చేశారు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిజాం పరిపాలనలో కుమ్రంభీం వీరోచిత పోరాటం చేశారు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ఆసిఫాబాద్, వెలుగు: ఆదివాసీ గిరిజన వీరుడు, పోరాట యోధుడు కుమ్రంభీంకు సొంతరాష్ట్రం ఏర్పడ్డాకే సముచిత గౌరవం, గుర్తింపు దక్కాయని, కుమ్రంభీం పేరును విశ్వవ్యాప్తం చేసేందుకు టీఆర్ఎస్ సర్కార్ కృషి చేస్తోందని రాష్ట్ర అటవీ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్ లో కుమ్రంభీం 82వ వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల కుమ్రం విగ్రహానికి, సమాధికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటైన గిరిజన దర్బార్ లో మంత్రి మాట్లాడుతూ నిజాం పరిపాలనలో రైతుల సంక్షేమం కోసం కుమ్రంభీం వీరోచిత పోరాటం చేశారన్నారు.

రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిచ్చి భీం జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. జోడేఘాట్​లో రూ.25 కోట్లతో మ్యూజియం, విగ్రహం ఏర్పాటుతో పాటు డబుల్ లైన్ రోడ్డు వేయించామన్నారు. దీపావళి సందర్భంగా గిరిజన గ్రామాల్లో అడే దండారిలకు రూ.కోటి మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. దేవాదాయ శాఖ తరఫున గిరిజన గ్రామాల్లో రూ.10లక్షల రూపాయల చొప్పున వంద ఆలయాలు కట్టిస్తామని హామీ ఇచ్చారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని, ప్రస్తుతం సర్వేలు జరుగుతున్నాయని చెప్పారు. కోర్టుల్లో ఉన్న కేసులను కూడా క్లియర్​చేసి పోడు రైతులకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు.

గిరిజనులకు ఇప్పటివరకున్న ఆరు శాతం రిజర్వేషన్​ను 10 శాతానికి పెంచుతూ సీఎం కేసీఆర్​ నిర్ణయం తీసుకున్నారన్నారు. రోడ్డు నిర్మాణాలకు ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​ క్లియరెన్స్ లేక పనులు ముందుకు సాగడం లేదని లీడర్లు తమ దృష్టికి తీసుకొచ్చారని, దీనిపై ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులంతా కలిసి చర్చిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్​పర్సన్​ లక్ష్మి,  ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, కలెక్టర్లు రాహుల్ రాజ్, సిక్తా పట్నాయక్, ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి, అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, ఎస్పీ సురేశ్​కుమార్,  డీఎఫ్​వో దినేశ్​కుమార్, మాజీ ఎంపీ నగేశ్, పద్మశ్రీ కనకరాజు, కుమ్రంభీం మనుమడు సోనేరావు, వర్ధంతి నిర్వహణ కమిటీ అధ్యక్షులు పెందూర్ మోహన్ పాల్గొన్నారు.