పనులు చేయరు.. పునరావాసం కల్పించరు

పనులు చేయరు..  పునరావాసం కల్పించరు

ఆసిఫాబాద్, వెలుగు : కుమ్రంభీం ప్రాజెక్టు బ్యాక్​ వాటర్​ తో దేవుడ్ పల్లి, డాబ్​ గూడా గ్రామాల ప్రజలు 17 సంవత్సరాలుగా తిప్పలు పడుతూనే ఉన్నారు. ఏటా వర్షాకాలంలో ఈ గ్రామాలు జలదిగ్బంధం అవుతున్నాయి.   పునరావాసం పనులు పూర్తి కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఆసిఫాబాద్ మండలం ఆడ గ్రామం పెద్ద వాగు పై 10 టీఎంసీల సామర్థ్యంతో కుమ్రంభీం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని 2006 సంవత్సరంలో పూర్తి చేశారు.  అనంతరం ప్రభుత్వం పునరావాస గ్రామాల్లో సౌలతులు కల్పించేందుకు రూ.110.4  కోట్లు, భూములు కోల్పోయిన రైతులకు  రూ.157 కోట్లు మంజూరు చేసింది. మొత్తం పదకొండు పునరావాస గ్రామాలు ఏర్పాటు చేయగా,  దేవుడ్ పల్లి , రాంజీగుడా, డాబ్ గూడా , రాంనగర్‌‌లను ముంపు గ్రామాలుగా ప్రకటించారు.  ఈ ముంపు గ్రామాల్లో  పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.  ప్రాజెక్టు బ్యాక్​ వ్యాటర్‌‌ వల్ల ఆయా గ్రామాల్లో విష పురుగుల సంచారంతో  తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. 

14  ఎకరాల్లో పునరావాస కాలనీ 

దేవుడ్ పల్లి , డాబ్ గుడా గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించేందుకు గవర్నమెంట్  గ్రామ సమీపంలో14 ఎకరాల స్థలాన్ని పునరావాస కాలనీ  కోసం కేటాయించింది. ఈ పునరావాస కేంద్రంలో సీసీ రోడ్లు, కరెంట్, స్కూల్ బిల్డింగ్ నిర్మాణం, తదితర సౌలత్ ల  కోసం రూ. 4.35 కోట్లు కేటాయించారు. కేవలం సైడ్ డ్రైనేజీలు మాత్రమే నిర్మించి అధికారులు, కాంట్రాక్టర్ చేతులు దులుపుకొన్నారు.  

పునరావాసం లేక ఉన్న ఊరు అభివృద్ధికి కాక..

దేవుడ్ పల్లి, డాబ్ గూడ గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడంలో ఏళ్లుగా అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతున్నారు. పునరావాసం పూర్తి చేయక, ఉన్న ఊర్లో డెవలప్ మెంట్ లేక ఆ గ్రామాల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.  ఉన్న ఊర్లో ఏదైనా డెవలప్ మెంట్ చేయాలని అడిగితే ముంపునకు గురైన గ్రామంలో అభివృద్ధి పనులు చేసిన వెస్ట్ అంటూ అధికారులు పట్టించుకోవడం లేదు. వానకాలంలో గ్రామానికి మూడు వైపులా ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ చేరుతోందని సమస్యను పట్టించుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్ని సార్లు చెప్పినా సమస్య పరిష్కరించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

 సర్కార్ నిర్లక్ష్యం చేస్తోంది

పదిహేడు ఏళ్లుగా పునరావాస కాలనీలో అధికారులు పనులు చేయడం లేదు.  కేవలం డ్రైనేజీలు నిర్మించి వదిలేశారు.  ఇటు పునరావాసం లేక , ఉన్న ఊరిలో సౌలత్ లు లేక గోస పడుతున్నం. 

--–  మహత్మే శ్రావణ్, దేవుడ్ పల్లి, గ్రామస్థుడు

పనులు కంప్లీట్ చేయాలి

ఏళ్లు గడుస్తున్నా పునరావాసం పనులు పూర్తి చేయడం లేదు.  అసౌకర్యాల మధ్య బతుకుతున్నం. వానాకాలంలో గ్రామం చుట్టూ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ చేరుతోంది.  ఏటా గోస పడుతున్నాం. వానాకాలంలో పాములు, తేళ్లతో సహవాసం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు, లీడర్లు స్పందించి పునరావాసం పనులు జల్దీ పూర్తి చేయాలి. 

-తాక్ సాండే విట్టు , దేవుడ్ పల్లి , గ్రామస్థుడు