డేంజరస్​గా అందెవెల్లి బ్రిడ్జి

డేంజరస్​గా అందెవెల్లి బ్రిడ్జి

బ్రిడ్జిపైకి వెళ్లకుండా ఇరువైపులా గోడ నిర్మాణం

కాగజ్ నగర్, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్​జిల్లా కాగజ్ నగర్ – దహేగాం మండలాల మధ్య అందెవెల్లి సమీపంలో పెద్దవాగు మీద ఉన్న హైలెవెల్ బ్రిడ్జి మరింత డేంజర్ గా మారింది. బ్రిడ్జి పిల్లర్ పక్కకు ఒరిగి రెండేళ్లు కావస్తున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో వంతెన స్లాబ్ మరింత కుంగింది. దీన్ని ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించారు. గత ఏడాది పోలీసులు ముందు జాగ్రత్తగా బారికేడ్లను పెట్టి భారీ వెహికల్స్​రాకపోకలు నిలిపివేశారు.

ఇప్పుడు పిల్లర్ మరింత కుంగడంతో స్లాబ్ పక్కకు ఒరిగింది. దీంతో దానిపై నడిచేందుకు సైతం జనం భయపడుతున్నారు. దహేగాం మండలవాసులు కాగజ్ నగర్ తో పాటు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ఇదే ఏకైక మార్గం. బ్రిడ్జి ప్రమాదకరంగా మారడంతో అత్యవసర పరిస్థితుల్లో పక్కనున్న మంచిర్యాల జిల్లా తాండూరు, బెల్లంపల్లి మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. బ్రిడ్జి కుంగిన ప్రదేశాన్ని కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్, రూరల్ సీఐ నాగరాజు పరిశీలించారు. వెంటనే ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేస్తూ రెండు వైపులా
 గోడ కట్టించారు.