
- షిండేను ఉద్దేశిస్తూ అభ్యంతరకర కామెంట్లు
- స్టూడియోను ధ్వంసం చేసిన శివసేన కార్యకర్తలు
- క్షమాపణలు చెప్పాల్సిందేనన్న సీఎం ఫడ్నవీస్
- కోర్టు ఆదేశిస్తే చెప్తానన్న కునాల్
- స్టూడియో అక్రమ నిర్మాణాలు కూల్చేసిన బీఎంసీ
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశిస్తూ స్టాండప్ కమేడియన్ కునాల్ కమ్రా చేసిన కామెంట్లు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ముంబై ఖార్ ప్రాంతంలోని ‘ది యూనికాంటినెంటల్ హోటల్’లోని హాబిటాట్ కామెడీ క్లబ్‌లో ఆదివారం కునాల్ కమ్రా షో జరిగింది. ఈ ప్రోగ్రామ్‌లో ఏక్‌నాథ్ షిండేను కునాల్ కమ్రా ‘ద్రోహి’గా పేర్కొన్నాడు. దీంతో శివసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హోటల్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు.
ఫర్నిచర్, కిటికీలు, కామెడీ క్లబ్‌కు సంబంధించిన మైక్‌లు, సీలింగ్‌ను ధ్వంసం చేశారు. షిండేపై చేసిన కామెంట్లకు గాను కునాల్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. 11 మందిని అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్‌పై అందరినీ రిలీజ్ చేశారు. తమిళనాడులో ఉన్న కునాల్‌తో మాట్లాడారు. ఇక చివరికి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు రంగంలోకి దిగి ‘ది యూనికాంటినెంటల్ హోటల్’ అక్రమ నిర్మాణాలను కూల్చేశారు.
అగౌరవపరిస్తే ఊరుకోం: దేవేంద్ర ఫడ్నవీస్
డిప్యూటీ సీఎం షిండేకు కునాల్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. లీడర్లను కించపర్చినా, అగౌరవపర్చినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాగా, షిండేపై కునాల్ చేసిన కామెంట్లను డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఖండించారు. అయితే, కునాల్ మాట్లాడినవన్నీ నిజాలేనని మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. షిండే ఓ ద్రోహి అని స్పష్టం చేశారు. కమ్రా కామెంట్లతో ఏకీభవిస్తున్నామని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
ఆ కామెంట్లపై ఎలాంటి పశ్చాత్తాపం లేదు: కునాల్ కమ్రా
షిండేను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్లపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని స్టాండప్ కమేడియన్ కునాల్ కమ్రా స్పష్టం చేశాడు. ‘‘షిండేను ద్రోహి అన్నందుకు నాకేం పశ్చాత్తాపం లేదు. నేను చెప్పిందంతా నిజమే. షిండేకు బహిరంగంగా క్షమాపణ చెప్తాను.. కానీ, సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పమంటే చెప్పను. నేను కేవలం కోర్టులు కోరినప్పుడు మాత్రమే క్షమాపణలు చెప్తాను’’ అని ముంబై పోలీసులతో కమ్రా అన్నట్లు సమాచారం.
కునాల్ ఏమన్నాడు?
హాబిటాట్ కామెడీ క్లబ్‌లో భాగంగా కునాల్ కమ్రా చేసిన కామెంట్లు మహారాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలకు దారితీశాయి. ‘‘శివసేన నుంచి శివసేన బయటికి వచ్చింది. ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయింది. అంతా గందరగోళంగా ఉంది’’ అంటూ మహారాష్ట్ర రాజకీయాల గురించి కునాల్ కామెంట్లు చేశాడు. ఏక్‌నాథ్ షిండేను ద్రోహిగా అభివర్ణించాడు. ఆపై ‘దిల్ తో పాగల్ హై’ అనే హిందీ పాటలోని చరణాలను రాజకీయాలకు అనుగుణంగా మార్చి అవమానకర రీతిలో పాడారు. దీంతో శివసేన షిండే వర్గం కునాల్‌పై భగ్గుమన్నది.