ప్రజాసమస్యలపై ఉద్యమ కార్యాచరణ : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 

ప్రజాసమస్యలపై ఉద్యమ కార్యాచరణ : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం: కూనంనేని
  • రేపటి నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు

హైదరాబాద్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు మహాసభల వేదికగా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎంతో పొత్తు ఉంటుందని, అదే విధంగా కాంగ్రెస్‌‌తోనూ స్నేహబంధం కొనసాగుతుందని తెలిపారు. హైదరాబాద్‌‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మక్దూం భవన్‌‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలు మేడ్చల్‌‌ మల్కాజ్‌‌గిరి జిల్లా గాజులరామారంలోని మహారాజ గార్డెన్స్‌‌‌‌‌లో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు మూడు రోజులపాటు నిర్వహించనున్నట్టు కూనంనేని తెలిపారు. ఈ మహాసభల్లో 743 ప్రతినిధులతోపాటు ప్రత్యేక ఆహ్వానితులు కలుపుకుని వెయ్యి మంది పాల్గొంటారని చెప్పారు. బుధవారం ఉదయం 9 గంటలకు జీడిమెట్ల పోలీస్‌‌ స్టేషన్‌‌ నుంచి మహాసభల వేదిక మహారాజ గార్డెన్స్‌‌ వరకు రెడ్‌‌ ప్లాగ్‌‌ మార్చ్‌‌ ఉంటుందన్నారు.

ఉదయం 10 గంటలకు సీపీఐ సీనియర్‌‌ నాయకుడు కందిమళ్ల ప్రతాపరెడ్డి అరుణ పతాకాన్ని ఎగురవేస్తారని, ఉదయం 11గంటలకు రాష్ట్ర 4వ మహాసభలను సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రారంభిస్తారని తెలిపారు. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్​రెడ్డి, పశ్యపద్మ, జాతీయ కౌన్సిల్‌‌ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు  పాల్గొన్నారు.