టీఆర్ఎస్‭తో పొత్తు కుదరకపోతే ఒంటరిగానే పోటీ: కూనంనేని సాంబశివరావు

టీఆర్ఎస్‭తో పొత్తు కుదరకపోతే ఒంటరిగానే పోటీ: కూనంనేని సాంబశివరావు

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లు మార్చేది లేదంటూ వచ్చిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పందించారు. తమకు రావాల్సిన సీట్లు ఇవ్వకపోతే.. తాము మద్దతు నుంచి తప్పుకుని పోటీ చేస్తామని చెప్పారు. ఇప్పటికే 119 అసెంబ్లీ సెగ్మెంట్‭లో భూత్ స్థాయి కమిటీలు వేస్తున్నామని.. టీఆర్ఎస్‭తో పొత్తు కుదరకపోతే తాము ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే తమ వద్దకు రావాలని కూనంనేని సాంబశివరావు అన్నారు. ఎల్బీనగర్ లోని ఓ గార్డెన్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 

తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని కూనంనేని సాంబశివరావు అన్నారు. ఎన్నో అడ్డంకులు వచ్చినా ఆర్టీసి హక్కుల కోసం కొట్లాడింది ఎంప్లాయిస్ యూనియన్ అని గుర్తు చేశారు. హుజూర్ నగర్ ఎన్నికల్లో అధికార పార్టీపై... మద్దతు ఇచ్చి ఆర్టీసీ కార్మికుల కోసం ఉపసంహరించుకున్నామని చెప్పారు. ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్ రెడ్డి మృతితో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి కార్మిక ఉద్యమాన్ని నడిపించామని అన్నారు. కష్టాల్లో ఉన్న కార్మికుల కోసం వెన్నంటి ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కష్టాల్లో ఉన్న కార్మికుల సమస్యల కోసం పోరాడుతూనే ఉంటామని కూనంనేని సాంబశివరావు అన్నారు.