
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే నని ఈ ఘటన చూస్తే అర్దమవుతుంది. ఆంధ్ర ప్రదేశ్ .. కర్నూలు జిల్లాలో రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో.. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కర్నూలు జిల్లా గోనెగండ్ల సమీపంలో పెను ప్రమాదం తప్పింది. ఆదోని డిపోకు చెందిన బస్సు.. ఎమ్మిగనూరు నుంచి కర్నూల్‌కి 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న సమయంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు ఇంజన్ దగ్గర ఒక్కసారి మంటలు చెలరేగి పొగ దట్టంగా అలుముకుంది. ఈ విషయాన్ని గమనించిన బస్సు డ్రైవర్ పక్కకు ఆపి.. ప్రయాణికులను అందరిని దింపేశాడు.
రోడ్డుపై బస్సు తగలబడుతుండడం చూసిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు.. బకెట్లతో నీళ్లు చల్లారు. దీంతో మంటలు అదుపులోకి వచ్చారు. ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.