కువైట్ పాలకుడు షేక్ నవాఫ్ మృతి

కువైట్ పాలకుడు షేక్ నవాఫ్ మృతి

దుబాయ్ : మిడిల్ ఈస్ట్ దేశం కువైట్ పాలకుడు షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా(86) శనివారం కన్నుమూశారు. “కువైట్ ప్రజలమైన మేం చాలా విచారంతో.. అరబ్.. ఇస్లామిక్ దేశాలు, ప్రపంచంలోని స్నేహపూర్వక ప్రజలకు హిస్ హైనెస్ ఎమిర్, షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబా కన్నుమూశారని తెలియజేస్తున్నం. ఈ రోజు ఆయన మరణానికి సంతాపం తెలుపుతున్నం”అని కోర్టు మంత్రి షేక్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ సబా కువైట్ అధికారిక మీడియాలో ప్రకటించారు. నవంబర్ నెల చివరలో షేక్ నవాఫ్ అనారోగ్యంతో ఆసుపత్రికి చేరారు. అక్కడ ట్రీట్​మెంట్ తీసుకుంటున్న ఆయన తుదిశ్వాస విడిచారు.

అధికారులు మరణానికి కారణం చెప్పలేదు. ఆరోగ్య పరీక్షలు, వైద్యం కోసం ఆయన 2021 మార్చిలో అమెరికా వెళ్లినట్లు గతంలో మీడియాలో వార్తలు వచ్చాయి. 2020లో షేక్ సబా అల్ అహ్మద్ అల్ సబా మరణించిన తరువాత షేక్ నవాఫ్  కువైట్​రాజుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం ఆయన సవతి సోదరుడు, యువరాజు అయిన 83 ఏండ్ల షేక్ మెషల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా కువైట్ పాలకుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.