
- కర్నాటక ఎంపీ బసవరాజ్ బొమ్మై ప్రశ్నకు కేంద్రం సమాధానం
- భాగస్వామ్య రాష్ట్రాల కోరిక మేరకు మార్పులు ఉండొచ్చని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: కృష్ణానది జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ) 2 అవార్డులో రాష్ట్రాల అభ్యర్థన మేరకు భవిష్యత్తులో సవరణలు జరగవచ్చని కేంద్రం పేర్కొంది. గతంలో ట్రిబ్యునల్ నిర్దిష్ట సమయం ముగిసిన తర్వాత కేటాయింపులను కాలానుగుణంగా సమీక్షించాలని భాగస్వామ్య రాష్ట్రాలు కోరినందున ఈ మార్పులు ఉండవచ్చని తెలిపింది.కర్నాటక ఎంపీ బసవరాజ్ బొమ్మై గురువారం లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌధరి ఈ మేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
2010 డిసెంబరులో అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం 1956 సెక్షన్ 5(2) ప్రకారం... కేడబ్ల్యూడీటీ 2 తన నివేదిక, నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిందని ఆయన తెలిపారు. తర్వాత కేంద్రం, కృష్ణా బేసిన్ లోని భాగస్వామ్య రాష్ట్రాలు చట్టంలోని సెక్షన్ 5(3) కింద ట్రిబ్యునల్ ను మరింత వివరణ కోరాయన్నారు. దీనికి స్పందిస్తూ 2013 నవంబర్ 29న ఉమ్మడి ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక మధ్య కేడబ్ల్యూడీటీ 2 నీటి కేటాయింపులను సిఫార్సు చేసిందన్నారు.
ఈలోపు 2010 రిపోర్టును ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిందని పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపి తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు కేడబ్ల్యూడీటీ నిర్ణయాన్ని చట్టంలోని సెక్షన్ 6 (1) ప్రకారం అధికారిక గెజిట్‌లో ప్రచురించరాదని స్టే విధించిందని వివరించారు. అందువల్ల 2013లో కేడబ్ల్యూటీ ఆవార్టును వెల్లడించడం సాధ్యం కాలేదన్నారు. అయితే... ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 89కి సంబంధించిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పరిష్కారానికి కృష్ణానది జల వివాదాల ట్రిబ్యునల్ ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ట్రిబ్యునల్ కాల పరిమితిని మరో ఏడాది పొడిగించామని చెప్పారు.