ఏఐ ప్రపంచంలో ప్రస్తుతం ఒకే ఒక్క పేరు మార్మోగిపోతోంది.. అదే ఎన్వీడియా(NVIDIA). పర్సనల్ కంప్యూటర్ల కోసం సరికొత్త ఏఐ చిప్‌లను తీసుకొస్తున్న ఈ గ్లోబల్ టెక్ దిగ్గజం.. ఇప్పుడు తన ఉద్యోగులకు ఇస్తున్న కళ్లు చెదిరే జీతాలతో ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అమెరికాలో ఇమ్మిగ్రేషన్ రూల్స్ కఠినతరం కావడంతో గూగుల్, అమెజాన్ వంటి బడా కంపెనీలు విదేశీ ఉద్యోగులను తీసుకోవడం తగ్గించేస్తుంటే.. ఎన్వీడియా మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వెళ్తోంది. గ్లోబల్ టాలెంట్‌ను ఆకర్షించడానికి H-1B వీసాల కోటాను భారీగా పెంచడమే కాకుండా.. ఏఐ నిపుణులకు కోట్ల రూపాయల శాలరీ ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది.
ఫెడరల్ లేబర్ ఫైలింగ్స్ ప్రకారం.. ఎన్వీడియా కంపెనీ 2026 ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాలలోనే దాదాపు 1,200 హెచ్-1బీ పొజిషన్లకు అప్రూవల్స్ పొందింది. గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 1,000 గా ఉండేది. ఇదే సమయంలో గూగుల్ హెచ్-1బీ నియామకాలు 5,100 నుండి 2,200 కి, అమెజాన్ నియామకాలు 6,100 నుండి 4,300 కి పడిపోయాయి. ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, చిప్ డిజైన్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ రంగాల్లో టాప్ పొజిషన్‌లో ఉండాలనే వ్యూహంతో ఎన్వీడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులను ఏరికోరి మరీ భారీ ప్యాకేజీలతో కంపెనీలోకి తెచ్చుకుంటున్నారు. శాలరీలు కేవలం వారి బేసిక్ జీతాలు మాత్రమే. ఇందులో కంపెనీ ఇచ్చే స్టాక్ ఆప్షన్స్, బోనస్‌లు ఇతర అదనపు ప్రయోజనాలు కలపలేదు. అవి కూడా కలిపితే ఈ ప్యాకేజీలు ఆకాశాన్ని తాకుతాయి.
| జాబ్ రోల్ | వార్షిక బేసిక్ శాలరీ రేంజ్ |
| రీసెర్చ్ సైంటిస్ట్ | రూ. 99.37 లక్షల నుండి రూ. 3.41 కోట్లు |
| ప్రిన్సిపల్ రీసెర్చ్ సైంటిస్ట్ | రూ. 2.60 కోట్ల నుండి రూ. 4.12 కోట్లు |
| సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ | రూ. 1.29 కోట్ల నుండి రూ. 3.41 కోట్లు |
| ఆర్కిటెక్ట్ | రూ. 1.26 కోట్ల నుండి రూ. 3.41 కోట్లు |
| ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ | రూ. 2.37 కోట్ల నుండి రూ. 4.07 కోట్లు |
| సీనియర్ ఆర్కిటెక్ట్ | రూ. 1.41 కోట్ల నుండి రూ. 3.41 కోట్లు |
| సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ | రూ. 1.33 కోట్ల నుండి రూ. 3.41 కోట్లు |
| డెవ్‌ఆప్స్ ఇంజనీర్ | రూ. 1.38 కోట్ల నుండి రూ. 3.19 కోట్లు |
| డిస్టింగ్విష్డ్ ఏఐ అల్గారితమ్స్ ఇంజనీర్ | రూ. 2.94 కోట్ల నుండి రూ. 4.50 కోట్లు |
| ప్రిన్సిపల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ | రూ. 2.53 కోట్ల నుండి రూ. 4.07 కోట్లు |
| ప్రిన్సిపల్ సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ | రూ. 2.60 కోట్ల నుండి రూ. 4.12 కోట్లు |
| సీనియర్ నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్ | రూ. 1.30 కోట్ల నుండి రూ. 3.19 కోట్లు |
| సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ | రూ. 1.33 కోట్ల నుండి రూ. 3.41 కోట్లు |
| సీనియర్ సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ | రూ. 1.33 కోట్ల నుండి రూ. 3.41 కోట్లు |
| సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ | రూ. 1.03 కోట్ల నుండి రూ. 3.74 కోట్లు |
| సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ | రూ. 1.26 కోట్ల నుండి రూ. 2.75 కోట్లు |
| ఆర్కిటెక్చర్ డైరెక్టర్ | రూ. 3.06 కోట్ల నుండి రూ. 4.67 కోట్లు |
| డెవలపర్ రిలేషన్స్ డైరెక్టర్ | రూ. 2.94 కోట్ల నుండి రూ. 4.50 కోట్లు |
| సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ డైరెక్టర్ | రూ. 2.71 కోట్ల నుండి రూ. 4.12 కోట్లు |
| హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ మేనేజర్ | రూ. 1.87 కోట్ల నుండి రూ. 3.52 కోట్లు |
| ప్రొడక్ట్ మేనేజర్ | రూ. 1.90 కోట్ల నుండి రూ. 3.63 కోట్లు |
| ప్రోగ్రామ్ మేనేజర్ | రూ. 1.54 కోట్ల నుండి రూ. 3.08 కోట్లు |
| సీనియర్ మేనేజర్, సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్ | రూ. 2.60 కోట్ల నుండి రూ. 4.12 కోట్లు |
| సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ డైరెక్టర్ | రూ. 3.72 కోట్ల నుండి రూ. 4.50 కోట్లు |
| సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్ మేనేజర్ | రూ. 1.76 కోట్ల నుండి రూ. 3.41 కోట్లు |
ఎన్వీడియాలో ఏఐ రీసెర్చర్లు, చిప్ ఇంజనీరింగ్, సిస్టమ్స్ ఆర్కిటెక్చర్ విభాగాల్లో పనిచేసే సీనియర్ స్పెషలిస్టుల బేసిక్ శాలరీ సులభంగా రూ.4 కోట్లు దాటుతోంది. నెక్స్ట్ జనరేషన్ ఏఐ టెక్నాలజీని రూపుదిద్దుతున్న టాప్ టాలెంట్ ను ఎలాగైనా తమ వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతోనే ఎన్వీడియా ఈ స్థాయి రేంజ్‌లో జీతాలను కుమ్మరిస్తోంది. గ్లోబల్ టెక్ మార్కెట్లో మిగిలిన కంపెనీలు వెనకడుగు వేస్తున్నా, ఎన్వీడియా మాత్రం ఏఐ సామ్రాజ్యాన్ని ఏలడానికి టాలెంట్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందని వారికి ఆఫర్ చేస్తున్న శాలరీలే నిరూపిస్తున్నాయి.
