వైభవ్ సూర్యవంశీ. ఈ ఐపీఎల్ సీజన్లో ఈ బుడ్డోడి పేరు మోతమోగిపోయింది. విధ్వంసకర బ్యాటింగ్తో, బ్యాక్ టూ బ్యాక్ సిక్సులతో బౌలర్లపై విరుచుపడటం ఈ 15 ఏళ్ల క్రికెటర్ స్పెషాలిటీ. ఈ వండర్ కిడ్ మెరుపు బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిసింది. సచిన్ మొదలుకుని విరాట్ కోహ్లీ వరకూ వైభవ్ బ్యాటింగ్ జోరు చూసి ఫిదా అయిపోయారు.
ప్రస్తుతం విషయం ఏంటంటే.. ఈ 15 ఏళ్ల పోరడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నడు. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసేనాటికి.. సూర్యవంశీ 237.30 ట్రెండ్‌సెట్టింగ్ స్ట్రైక్-రేట్‌తో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజులను రెట్టింపు చేసుకున్నాడు.
ఈ క్రమంలో.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల విషయానికి వస్తే సూర్యవంశీ ఇప్పటికే కాంప్లాన్, రెడ్ బుల్ వంటి బ్రాండ్‌లను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఐపీఎల్ సీజన్లో అద్భుత ఆట తీరు కనబర్చడంతో సూర్యవంశీతో తమ బ్రాండ్స్ను ప్రమోట్ చేయించుకోవడం కోసం కంపెనీలు క్యూ కడుతున్నాయి. దీంతో.. ఇదే అదనుగా సూర్యవంశీ తన ఎండార్స్‌మెంట్ ఫీజులను దాదాపు రెట్టింపు చేశాడని టాక్. ఐపీఎల్ 2026 సీజన్కు ముందు.. సూర్య వంశీ ఒక్కో బ్రాండ్ ప్రమోషన్కు సుమారు కోటి చొప్పున తీసుకున్నాడు. ఇప్పుడు ఉన్న క్రేజ్తో ఒక్కో ప్రమోషన్కు రూ. 1.5 నుంచి 2 కోట్ల వరకు ఫీజు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
ఒక్కో డీల్కు రూ.2 కోట్లకు తగ్గేదేలే అంటున్న సూర్యవంశీ డిమాండ్తో కంపెనీలు నోరెళ్లబెడుతున్న పరిస్థితి. అయితే.. Gen-Zలకు కనెక్ట్ కావాలంటే సీనియర్ క్రికెటర్ల కంటే వైభవ్ సూర్యవంశీతోనే తమ ప్రొడక్ట్స్ను ప్రమోట్ చేయించడం బెటర్ అనే అభిప్రాయానికొచ్చిన కంపెనీలు అతను అడిగినంత ఇవ్వడానికి ముందుకొస్తున్నట్లు తెలిసింది. ఈ సూపర్ ఫామ్ ఎన్నాళ్లు ఉంటుందో తెలియదు. ఫామ్లో ఉన్నప్పుడే ఆదాయాన్ని పెంచుకోవాలని సూర్యవంశీతో పాటు అతని పేరెంట్స్ కూడా అభిప్రాయపడుతున్నారు.
