రూ.400 కోట్లతో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.. ఎక్కడంటే?

రూ.400 కోట్లతో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.. ఎక్కడంటే?

మన దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారతీయులు.. క్రికెట్‌ను ఓ ఆటగా కాకుండా ఓ ఎమోషన్‌లా భావిస్తారు. అందుకే ఎక్కడ క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగినా అభిమానులతో స్టేడియాలు నిండిపోతుంటాయి. ఈ ఆదరణను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి పచ్చ జెండా ఊపగా.. నిర్మాణానికి తొలి అడుగులు పడ్డాయి.

ఉత్తరప్రదేశ్, వారణాసిలోని రాజతలాబ్ ప్రాంతంలో నిర్మించనున్న క్రికెట్ స్టేడియం కాంట్రాక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ(L&T) చేజిక్కించుకుంది. సుమారు 30.6 ఎకరాల విస్తీర్ణంలో 30,000 కెపాసిటీతో ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా ఈ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నారు. రూ.400 కోట్ల అంచనా వ్యయంతో ఈ స్టేడియం నిర్మిస్తుండగా.. పూర్తవ్వడానికి మరో మూడేళ్లు పట్టొచ్చని తెలుస్తోంది.

రైతులకు రూ.120 కోట్ల పరిహారం

ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాజతలాబ్ ప్రాంతంలో రైతుల నుండి 31 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. అందుకు పరిహారంగా రైతులకు దాదాపు 120 కోట్ల రూపాయలను చెల్లించింది. ఈ భూమిని ప్రభుత్వం.. ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(యూపీసీఏ)కు 30 ఏళ్ల లీజుకు ఇవ్వనుంది. అందుకు ప్రతి ఏటా యూపీసీఏ..  యూపీ ప్రభుత్వానికి 10 లక్షల రూపాయలు చెల్లించనుందని సమాచారం. 

లక్నో, కాన్పూర్ తర్వాత యూపీలో ఇది మూడో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కావడం గమనార్హం.