
వెలుగు: సంగారెడ్డి జిల్లాలో పత్తి ఏరేందుకు కూలీలు దొరుకుతలేరు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి కూలీలను వలసకు తీసుకొచ్చి పనులు చేయిస్తున్నారు. వారు సైతం అనుకున్న స్థాయిలో దొరకకపోవడంతో పత్తి రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వలస కూలీలతో పనులు చేయించడం వల్ల వారికి స్థానికంగా నివాసాలు ఏర్పాటు చేసి ఇతరత్రా సౌకర్యాలు ముందుగానే సమకూర్చాల్సి ఉంటుంది. దీంతో పత్తి రైతులకు ఖర్చులు తడిసిమోపడవుతున్నాయి.
ఏటా జిల్లాలో పత్తి పంట సాగు గణనీయంగా తగ్గుతూ వస్తోంది. కూలీల కొరత వల్ల కొందరు రైతులు పత్తి జోలికి వెళ్లడం లేదు. ఓ వైపు కూలీల సమస్యలు మరోవైపు వర్షాలు, మంజీరా బ్యాక్ వాటర్ తో మునిగిన పంటలు ఇవన్నీ పత్తి రైతుల ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. సరైన దిగుబడి లేక పెట్టిన పెట్టుబడి సైతం చేతికొచ్చే పరిస్థితి కనిపించడంలేదు. పత్తి పంటను నమ్ముకున్న రైతులు ప్రస్తుత పరిస్థితుల్లో వలస కూలీల ఆర్థిక భారాన్ని భరించడం తప్ప చేసేదేమీలేదు.
జిల్లాలో 3.25 ఎకరాల్లో పత్తి సాగు
జిల్లాలో పత్తి ప్రధాన పంటగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్ లో 3.25 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. అనుకూలమైన నేలలు ఉండడంతో రైతులు ఎక్కువగా పత్తిని సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. గతంతో పోలిస్తే రెండు సీజన్లలో ఒకసారి 3.87 లక్షల ఎకరాలు, మరోసారి 3.50 లక్షల ఎకరాల్లో పత్తి పండించారు.
కానీ ఈసారి కొంచెం తగ్గుముఖం పట్టింది. రైతులకు కూలీల కొరత ప్రధాన సమస్యగా మారింది. పత్తి పంటకు కేంద్రం ఈసారి మద్దతు ధర పెంచినప్పటికీ సాగు తగ్గడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతంలో క్వింటాల్ మద్దతు ధర రూ.7,521 ఉండగా ఈసారి రూ.8,111కు పెంచారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి పంటలు అమ్ముకునే టైంలో కూలీల కొరత, వర్షాలు రైతులను నిరాశకు గురిచేస్తున్నాయి.
అడ్వాన్స్ ఇస్తేనే..
పత్తి ఏరేందుకు వలస కూలీలకు అడ్వాన్స్ ఇస్తేనే పనులకు వస్తున్నారు. ఏపీ నుంచి అనంతపురం, శ్రీకాకుళం, కర్నాటక ప్రాంతం నుంచి వలస కూలీలను తీసుకొస్తున్నారు. వారికి గుడారాలు, నిత్యావసర సరుకులకు అవసరమైన డబ్బు ముందే ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇస్తేనే ఒప్పందం ప్రకారం కూలీలు పనులకు వస్తున్నారు. ఈ భారం అంతా రైతులపై పడడంతో పాటు దిగుబడి తగ్గి గిట్టుబాటు కావడం లేదని బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు.