డబ్బులు ఇవ్వలేదంటూ అడ్డా కూలీల ఆందోళన

డబ్బులు ఇవ్వలేదంటూ అడ్డా కూలీల ఆందోళన

డబ్బులు ఇవ్వలేదని బస్సులు ఆపి ఆందోళన

యాదాద్రి/చౌటుప్పల్, వెలుగు: మునుగోడులో సీఎం కేసీఆర్​ మీటింగ్​కు వెళ్లిన అడ్డా కూలీలు తమకు డబ్బులు ఇవ్వలేదంటూ ఆందోళనకు దిగారు.  మీటింగ్ కు చౌటుప్పల్​ మున్సిపాలిటీ, చౌటుప్పల్, సంస్థాన్​ నారాయణపురం నుంచి జనాలను సమీకరించారు. ఒక్కొక్కరికి రూ. 500 కూలి, ఫుడ్డు ఇస్తామని చెప్పారని కూలీలు చెబుతున్నారు. ఒక్కో మండలానికి 5 వేల మంది అనుకోగా ఎక్కువగా వచ్చారు. మీటింగ్​ముగిసిన తర్వాత ఎక్కువగా వచ్చిన జనాలకు పైసలెవరు ఇవ్వాలని నిర్వాహకులు తర్జనభర్జన పడ్డారు. తిరుగు ప్రయాణంలో ఇస్తామని ఒకచోట గంటసేపు ఆపి కొందరికే కూలి ఇచ్చారు.

మరికొందరికి పైసలు ఇవ్వకుండానే చౌటుప్పల్ సెంటర్​లో దించి మధ్యవర్తులు జారుకున్నారు. విషయం గుర్తించిన అడ్డాకూలీలు తమను తీసుకొచ్చిన బస్సులను పైసలిచ్చేదాక పోనీయమంటూ అడ్డంగా నిలబడ్డారు. రోడ్డుపై వందల మంది గుమిగూడడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు విషయం తెలుసుకొని ఏం చేయాలో తోచక మౌనంగా ఉండిపోయారు. టీఆర్ఎస్​లీడర్​ఒకరు అక్కడికి చేరుకొని ఉదయం అందరికీ కూలి ఇప్పించే బాధ్యత తనదని హామీ ఇవ్వడంతో బస్సులను అక్కడి నుంచి పంపించారు.