
- మెదక్ ఎంసీహెచ్ లో అటెండెంట్లకు అవస్థలు
మెదక్ పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్) లో గర్భిణీల వెంట వచ్చే అటెండెంట్లు సౌకర్యాల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆస్పత్రిలో ప్రతీ నెల 300లకు పైగా డెలివరీలు జరుగుతున్నాయి. కొన్ని నెలలుగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ప్రతీ నెల పరీక్షల కోసం వచ్చే, డెలివరీ అయ్యే గర్భిణీల వెంట వచ్చే అటెండెండ్లు పెద్ద సంఖ్యలో ఉంటారు. పరిశుభ్రతను, మెయింటెనెన్స్ ను దృష్టిలో పెట్టుకొని పేషంట్ల వెంట వచ్చే వారందరిని ఆస్పత్రిలోకి అనుమతించరు.
వారు ఆస్పత్రి ప్రాంగణంలో వేచి ఉండేందుకు వసతి సదుపాయం లేదు. దీంతో అరుగుల మీద, ర్యాంప్ పై కూర్చోవాల్సి వస్తోంది. వారు తీసుకొచ్చే భోజనాలు, బట్టల బ్యాగులు ఆస్పత్రిలోనికి తీసుకెళ్లనివ్వక పోవడంతో పోర్టికోలో మెయిన్ డోర్ దగ్గర ఉంచాల్సి వస్తోంది. వసతి లేక భోజనాలు ఆరుబయటే చేయాల్సి వస్తోంది. వానకు తడుస్తూ.. ఎండకు ఎండుతూ ఇబ్బందులు పడుతున్నారు. డెలివరీ అయిన వారికి సహాయకులుగా వచ్చే వారు రాత్రి అక్కడే బస చేస్తుండగా, స్నానాలకు, కాలకృత్యాలు తీర్చుకోవడానికి అవస్థలు పడుతున్నారు. రద్దీకి అనుగుణంగా అటెండెంట్ల కోసం ఆస్పత్రి ఆవరణలో అన్ని వసతులతో వెయిటింగ్ హాల్ నిర్మించాలని వారు కోరుతున్నారు. - మెదక్, వెలుగు: