
- కేంద్రం నిర్ణయించిన ధర రూ.2400
- రూ.2 వేల లోపే చెల్లిస్తున్న ప్రైవేట్వ్యాపారులు
- మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్న రైతులు
మెదక్/నిజాంపేట, వెలుగు: సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో మక్క రైతులు నష్టపోతున్నారు. ఈ వానాకాలం సీజన్ లో జిల్లాలో 2,752 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. కొద్ది రోజులుగా పంట దిగుబడి వస్తోంది. ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పినా ఇంత వరకు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
దీంతో రైతులు తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం మక్కలకు మద్దతు ధర క్వింటాలుకు రూ.2,400 నిర్ణయించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మక్కలు విక్రయిస్తే రైతులకు మద్దతు ధర లభిస్తుంది. దిగుబడులు చేతికందుతున్నప్పటికీ ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయలేదు. మరోవైపు అకాల వర్షాలు పడితే ఆరబోసిన మక్కలు తడిసి పోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇళ్లలో నిల్వచేయడానికి సరైన స్థలం లేకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుని వ్యాపారులు ధర తగ్గిస్తున్నారు. క్వింటాలుకు రూ.1,900 నుంచి రూ.2.000 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో రైతులు క్వింటాలుకు రూ.400 నుంచి రూ.500 వరకు నష్టపోతున్నారు.
గతేడాది ఎంఎస్పీ రూ.2225 ఉన్నా ప్రైవేట్ వ్యాపారులు రైతుల కల్లాల వద్దకే వచ్చి క్వింటాలుకు రూ.2,500కు పైగా చెల్లించి కొనుగోలు చేశారు. ఎంఎస్పీ ధర కంటే బహిరంగ మార్కెట్ లో ధర ఎక్కువ ఉండడంతో రైతులు మక్కలను ప్రైవేట్ వ్యాపారులకు అమ్మారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బర్డ్ ఫ్లూ సోకి పౌల్ట్రీ ఫారాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో వ్యాపారుల దగ్గర మొక్కజొన్న నిల్వలు అలాగే ఉన్నాయి. ఈ కారణంగా ఈ సంవత్సరం మొక్కజొన్నల ధర తక్కువ అయిందని ఓ పౌల్ట్రీ రైతు తెలిపారు.
ఆరెకరాలు సాగు చేసినా
నేను ఈ సారి ఆరెకరాల్లో మక్క పంట వేసిన. రూ.1.5 లక్షల దాక ఖర్చయింది. మూడేండ్లుగా మక్కలకు మంచి డిమాండ్ ఉంది. గవర్నమెంట్ పెట్టె రేటు కంటే ప్రైవేట్ వ్యాపారులు ఎక్కువ పెట్టి కొనుక్కుని పోయిండ్రు. ఈసారి గవర్నమెంట్ రేట్ కంటే తక్కువ ధరకు కొంటుండ్రు. ఇట్లయితే రైతులం లాస్ అవుతాం. గవర్నమెంట్ వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులను ఆదుకోవాలి. – రమేశ్, రైతు, చల్మెడ
కొనుగోళ్లు షురూ చేయాలి
మొక్కజొన్నలను ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకు కొనడంతో రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల వద్ద నుంచి మొక్కజొన్నలను కొనుగోలు చేయాలి. –బాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ