ఆందోళనల బాటలో లడక్​ : బుర్ర మధుసూదన్ రెడ్డి

ఆందోళనల బాటలో లడక్​ : బుర్ర మధుసూదన్ రెడ్డి

జమ్ము కాశ్మీర్‌‌‌‌ రాష్ట్రాన్ని అక్టోబర్‌‌‌‌ 31, 2019న కేంద్రం  రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడదీసింది. ‘లడక్‌‌‌‌’, ‘జమ్ము కాశ్మీర్‌‌‌‌’ పేరిట యూటీలు ఏర్పాటు చేసింది. ‘చిన్న టిబెట్‌‌‌‌’గా  హిమాలయ శిఖరాల మధ్య ఉన్న పీఠభూమి ‘లడక్’‌‌‌‌కు పేరుంది. బౌద్ధ మతస్థులు అధికంగా ఉన్న లడక్‌‌‌‌ ప్రాంతంలో  లేహ్‌‌‌‌ అనే ప్రధాన పట్టణం ఉంది. లడక్‌‌‌‌ యూటీలో లేహ్‌‌‌‌, కార్గిల్‌‌‌‌ అనే రెండు జిల్లాల్లో 2.90 లక్షల బౌద్ధ/ముస్లిం మతస్థులు జీవిస్తున్నారు.

లడక్‌‌‌‌ జిల్లాలో అక్షరాస్యత 62 శాతం, కార్గిల్‌‌‌‌ జిల్లాలో 58 శాతంగా నమోదు అయ్యింది. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ‘జమ్‌‌‌‌యంగ్‌‌‌‌ సిరింగ్‌‌‌‌ నామ్‌‌‌‌గ్యాల్’‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ సభ్యుడిగా గెలిచారు. 2020లో లేహ్/కార్గిల్‌‌‌‌‌‌‌‌ ‘హిల్‌‌‌‌ కౌన్సిల్స్‌‌‌‌’ ఎన్నికలు కూడా నిర్వహించిన విషయం మనకు తెలుసు. ఈ ప్రాంతం ఏడాదిలో ఎక్కువ మాసాలు మంచుతో నిండి ఉండడంతో  మే‌‌‌‌,- సెప్టెంబర్‌‌‌‌ మాసాల మధ్య మాత్రమే స్వల్పకాలిక పంటలను సాగు చేయడం జరుగుతోంది. 

బార్డర్‌‌‌‌ మార్చ్‌‌‌‌, జైల్‌‌‌‌ భరో ఆందోళన్‌‌‌‌కు ప్రణాళికలు

లడక్‌‌‌‌ రాష్ట్ర సాధన, 6వ షెడ్యూల్‌‌‌‌లో చేర్చడం, పర్యావరణ పరిరక్షణ, స్థానికులకు ఉద్యోగాల కల్పన, తమ ప్రాంతాలకు రెండు ఎంపీ స్థానాలు కేటాయించడం, స్థానికులకే పట్టణ/పల్లెల పాలన పగ్గాలు, ఆస్తి హక్కులు, అడవుల/జల వనరుల సంరక్షణ, తమ ప్రాంత సంస్కృతిని కాపాడడం లాంటి డిమాండ్లతో ప్రముఖ వాతావరణ కార్యకర్త (క్లైమేట్‌‌‌‌ ఆక్టివిస్ట్) ‘సోనమ్‌‌‌‌ వాంగ్‌‌‌‌చుక్‌‌‌‌’ నేతృత్వంలో సుదీర్ఘ పోరు నడుస్తున్నది.

గాంధీ సూచించిన మార్గంలో ‘లేహ్‌‌‌‌ ఎపెక్స్‌‌‌‌ బాడీ’ నేతృత్వంలో మహిళలు/యువతీ, యువకులు/మత పెద్దలు/సీనియర్‌‌‌‌ సిటిజెన్స్‌‌‌‌ సంయుక్తంగా 60,000 మంది ఉద్యమకారులు నిర్వహించిన తొలి దశ పోరులో భాగంగా 21 రోజులుగా    ( మార్చి 06–- 26  వరకు) నిరాహార దీక్షలు చేపట్టి తాత్కాలికంగా విరామం ఇవ్వడం, తదుపరి దీర్ఘకాలం పాటు పోరాటాలను సాగించడానికి ప్రణాళికలు వేయడం జరుగుతున్నది. ఈ పోరుతో పాటు గాంధీ చేపట్టిన పౌర సహాయ నిరాకరణ ఆందోళన ‘దండీ మార్చ్‌‌‌‌’ని పోలిన ఆందోళనను ఏప్రిల్‌‌‌‌ 07, 2024న ‘బార్డర్ మార్చ్‌‌‌‌‌‌‌‌’ పేరుతో చైనా సరిహద్దు వరకు కాలి నడక యాత్రను చేపట్టడం, రాబోయే రోజుల్లో ‘జైల్‌‌‌‌ భరో ఆందోళన్‌‌‌‌’ లాంటి పోరాటాలను శాంతియుతంగా చేయనున్నారు.

చర్చలతో సత్వర పరిష్కారం సాధ్యం కాదా !

ఇప్పటికే పలు మార్లు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిగినప్పటికీ పరిష్కారం మాత్రం దొరకలేదని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను మరిచి పేద ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నదని కూడా అక్కడి ప్రజలు వాపోతున్నారు. తమ డిమాండ్ల సాధనకు, కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి ‘లడక్‌‌‌‌ ఎపెక్స్‌‌‌‌ బాడీ’తో పాటు ‘కార్గిల్‌‌‌‌  డెమోక్రటిక్‌‌‌‌ అలయన్స్‌‌‌‌’ లాంటి పలు మత/రాజకీయ/సామాజిక సంస్థలు కలిసి శాంతియుత ఆందోళనలను తీవ్రతరం చేయనున్నట్లు ప్రకటించారు.

లడక్‌‌‌‌ ప్రాంత ప్రజలు, పిల్లల భవిష్యత్తు, తమ పర్వత ప్రాంత పర్యావరణ పరిరక్షణ  తమకు ముఖ్యమని వాదించడం సముచితంగానే తోస్తున్నది. వాతావరణ ప్రతికూల మార్పులతో తమ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరగడం, మంచు కరగడం, జల వనరుల విధ్వంసం, వ్యవసాయానికి విఘాతం, గిరిజనుల జీవనోపాధులను మింగేయడం జరుగుతున్నదనే విషయాలను గమనించి, తగు పరిష్కారాలను చూపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది.

- డా: బుర్ర మధుసూదన్ రెడ్డి,
సోషల్​ ఎనలిస్ట్

 

  • Beta
Beta feature
  • Beta
Beta feature