బెయిల్ రద్దు చేయాలని సిట్ చెప్పినా ఎందుకు చేయలే?

బెయిల్ రద్దు చేయాలని సిట్ చెప్పినా ఎందుకు చేయలే?

న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన లఖీంపూర్ ఖేరి కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పును సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఆశిష్ కు బెయిల్ ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో బాధితుల కుటుంబీకులు వేసిన పిటిషన్ పై ఇవాళ కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్ మహేశ్ జెఠ్మలానీ.. ఈ కేసులో సాక్షులుగా ఉన్న 97 మందికి కట్టుదిట్టమైన భద్రత కల్పించామన్నారు. వారికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. నిందితుడికి (ఆశిష్ మిశ్రా) ఎలాంటి క్రిమినల్ హిస్టరీ లేదన్నారు. అయితే నిందితుడు బెయిల్ రద్దు చేయాలని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్.. రెండు సార్లు నివేదించినట్లు తెలిపిన నేపథ్యంలో ఈ విషయంలో యూపీ ప్రభుత్వ నిర్ణయం ఏంటని సీజేఐ ఎన్వీ రమణ సూటిగా ప్రశ్నించారు. బెయిల్ రద్దు చేయాలని సిట్ చెప్పినా ఎందుకు చేయలేదని అడిగారు. దీనికి ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు చేయాలని సిట్ తమకు ప్రతిపాదించిందని.. కానీ అతడు సాక్షులను ప్రభావితం చేస్తాడని తాము అనుకోవడం లేదని జెఠ్మలానీ జవాబిచ్చారు. వాదనల అనంతరం తీర్పును వాయిదా వేస్తున్నట్లు కోర్టు పేర్కొంది. 

ఇకపోతే, లఖీంపూర్ కేసులో సుప్రీం కోర్టు నియమించిన కమిటీ స్టేటస్ రిపోర్టును ఫైల్ చేసింది. ఈ కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్).. ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు చేయాలని రెండుమార్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిపాదించిందని కమిటీ సుప్రీంకు తెలిపింది. ఘటన జరిగిన సమయంలో నిందితుడు ఆశిష్ మిశ్రా అక్కడే ఉన్నాడని కమిటీ తన రిపోర్టులో వెల్లడించింది. ప్రమాదం జరిగిన రోజు యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య వాహనాల రూటు మార్చిన విషయం ఆశిష్ మిశ్రాకు తెలుసని కమిటీ పేర్కొంది.

మరిన్ని వార్తల కోసం:

త్రివిక్రమ్ శ్రీనివాస్కు ట్రాఫిక్ పోలీసుల ఫైన్ 

ప్రధాని తప్ప కేబినెట్ అంతా రాజీనామా

లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు