తిరుమలలో వైభవంగా గరుడ సేవ.. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు

తిరుమలలో వైభవంగా గరుడ సేవ.. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు

తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడవాహన సేవకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. ఇవాళ్టితో (సెప్టెంబర్ 28) శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఐదో రోజుకు చేరుకున్నాయి.  

గరుడవాహనంలో మలయప్పస్వామి తిరుమాడ వీధులలో ఊరేగుతూ దర్శనమిచ్చారు.  పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. 

 గరుడ సేవ రోజున లక్ష్మీకాసుల హారం, సహస్రనామ మాల, పచ్చలహారాన్ని ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి వారికి అలంకరించారు. వెన్నెల వెలుగుల్లో గరుడ వాహనంపై సర్వాలంకార భూషితుడైన శ్రీనివాసుడిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. సేవ సమయంలో స్వామి ఆలయాన్ని వీడి తిరుమాడ వీధుల్లో సంచరిస్తారన్నది భక్తుల విశ్వాసం. దేవతలు కూడా గరుడ సేవలో స్వామిని దర్శించుకోవడానికి వస్తారని అంటారు. అందుకే లక్షలాది మంది గరుడవాహన సేవను వీక్షించేందుకు తిరుమల చేరుకున్నారు. 

మొత్తం మూడు లక్షల మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకోవడానికి వచ్చినట్లు అంచనా వేస్తున్నారు టీటీడీ అధికారులు. గ్యాలరీల్లో సుమారు రెండు లక్షల మంది భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. 

గరుడ వాహనంపై మలయప్పను వీక్షించేందుకు 35 భారీ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. గరుడ వాహన సేవలో ఎలాంటి భద్రతా సమస్యలు తలెత్తకుండా భారీగా పోలీసులను మోహరించారు. తిరుమలలో 2 వేల 700 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. అలాగే 5 వేల మందికిపైగా భద్రతా సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.