ఐటీలో వర్క్ ఫ్రం హోం ఎఫెక్ట్.. రోడ్డునపడ్డ ఆఫీస్ బాయ్‌లు, డ్రైవర్లు

ఐటీలో వర్క్ ఫ్రం హోం ఎఫెక్ట్.. రోడ్డునపడ్డ ఆఫీస్ బాయ్‌లు, డ్రైవర్లు
  • రోడ్డున పడ్డ ఆఫీస్ బాయ్‌లు, డ్రైవర్లు, క్యాంటీన్ వర్కర్లు, సెక్యూరిటీ గార్డులు, మెకానిక్‌లు
  • కరోనా భయంతో వర్క్​ఫ్రం హోంకే  ఐటీ ఉద్యోగుల మొగ్గు
  • ఏడాదిన్నర నుంచి ఆఫీసులకు తాళాలు తీయని కంపెనీలు
  • ఆఫీసులు తెరిస్తేనే సాఫ్ట్​ సర్వీసుల్లోని వర్కర్లకు పని 
  • ఉపాధి కరువవడంతో ఊళ్లకు పోతున్న వర్కర్లు 
  • ఈఎంఐలకు పైసల్లేక క్యాబ్​లు అమ్మేసుకుంటున్న డ్రైవర్లు 

ఏడాదిన్నర కిందటి దాకా వాళ్లంతా ఐటీ కంపెనీళ్లో ఆఫీసు బాయ్​లుగానో, క్యాబ్​ డ్రైవర్లుగానో, క్యాంటీన్​ వర్కర్లు గానో, సెక్యూరిటీ గార్డులుగానో, మెకానిక్​లుగానో  సాఫ్ట్​ సర్వీసెస్​ అందిస్తూ వచ్చే జీతంతో బతుకుబండిని సాఫీగా సాగించేవారు. కరోనా ఎఫెక్ట్​తో ఐటీ ఆఫీసులన్నీ మూత పడటంతో వాళ్ల బతుకులన్నీ రోడ్డునపడ్డాయి. ఉన్న కొలువులు పోయి, చేసుకుందామంటే పనులు లేక ఆగమ వుతున్నారు. ఇట్ల హైదరాబాద్​ ఐటీ రంగంపై పరోక్షంగా ఆధారపడ్డ  దాదాపు 20 లక్షల మంది అల్లాడుతున్నారు. నిరుడు మార్చిలో ఐటీ ఉద్యోగు లందరికీ వర్క్​ ఫ్రం హోం ఇచ్చి ఆఫీసులను ఐటీ కంపెనీలు మూసేశాయి. ఆఫీసులు తెరిస్తే కానీ సాఫ్ట్​ సర్వీసెస్​ పనులు దొరికే అవకాశం లేదు. కరోనా భయంతో ఇప్పట్లో ఆఫీసులు తెరిచేందుకు కంపెనీలు సాహసించడం లేదు.

హైదరాబాద్, వెలుగు: కరోనాతో ఏ మాత్రం ఎఫెక్ట్​ కాని ఇండస్ట్రీ ఉందా అంటే అది ఐటీనే. ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్​ఫ్రమ్​ హోం ఇచ్చి బిజినెస్​లో ఏ మాత్రం  తేడా లేకుండా పని చేస్తున్నాయి. అయితే ఐటీపై ఆధారపడే సాఫ్ట్​ సర్వీసులు మాత్రం తీవ్రంగా ఎఫెక్ట్​ అయ్యాయి. హైదరాబాద్​ ఐటీలో ఆరు లక్షల మంది ఐటీ ఉద్యోగులు పని చేస్తుంటే సాఫ్ట్​ సర్వీసులతో  దాదాపు 20 లక్షల మంది బతుకుతుంటారు . ఈ సాఫ్ట్​ సర్వీసులన్నీ ఐటీ కంపెనీలకు అటాచ్​గా జరిగే పనులే. ఇందులో హౌస్​ కీపింగ్​, క్యాబ్​ సర్వీసులు, క్యాంటీన్లు, కెఫెటేరియాలు, సెక్యూరిటీ, మెకానిక్​, ఎలక్ట్రికల్​ లాంటి ఏడెనిమిది సర్వీసులు అందించేవాళ్లు ఉంటారు. నిరుడు కరోనా ఎంట్రీ అయినప్పటి నుంచి వీళ్లందరికీ ఉపాధి లేకుండా పోయింది. ఈ సర్వీసుల్లో కంపెనీ సైజు, ఆఫీస్ స్పేస్​ను  బట్టి ఒక్కో డిపార్ట్​మెంట్​లో వందలాది మంది సాఫ్ట్‌ సర్వీసెస్‌ వాళ్లు  పని చేస్తుంటారు. వీళ్లు కాకుండా కంపెనీల బయట ఫుడ్​ స్టాళ్లు, ఆటోలు, చిన్న చిన్న సర్వీసులతో ఇంకొందరు బతుకుతుంటారు. నిరుడు మార్చిలో కరోనా, లాక్​డౌన్​ నాటి నుంచి ఇప్పటివరకు హైదరాబాద్​లో ఐటీ కంపెనీలు తెరుచుకోలేదు. కొన్ని తెరుచుకున్నా వాటిలోనూ పెద్దగా సాఫ్ట్​ ఉద్యోగులను తీసుకోవడం లేదు. ఐటీ ఉద్యోగులంతా  ఆఫీసులకు వచ్చి పనులు చేస్తే  తప్ప ఈ సాఫ్ట్​ సర్వీసుల్లోని ఉద్యోగులందరికీ పని దొరకదు. సాఫ్ట్​ సర్వీసుల్లోని లక్షలాది మంది పనులు లేక దీనమైన బతుకులు వెళ్లదీస్తున్నారు. కొందరు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఐటీ కంపెనీలు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురుచూస్తున్నారు.

కిస్తీలు కట్టలేక క్యాబ్‌లు అమ్మేస్తున్నరు
ఐటీ సెక్టార్ లో 12 వేల క్యాబ్ లున్నాయి. ఇందులో కొందరు సబ్ కాంట్రాక్ట్ ల ద్వారా పనిచేసేవారుంటే, మరికొందరు సొంత బండ్లు నడిపిస్తుంటారు. ఒక్కో కంపెనీలో మూడు, నాలుగు షిఫ్ట్ లలో వంద నుంచి 150 మంది డ్రైవర్లు చేస్తుంటారు. హైదరాబాద్​లోని ఐటీ సెక్టార్ లో మూడు వేల ఐటీ కంపెనీలు ఉంటే మొత్తంగా రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల మంది క్యాబ్ డ్రైవర్లు ఉపాధి పొందుతున్నారు. కంపెనీలు మూతపడటంతో వీళ్ల బతుకులూ ఆగమయ్యాయి. వీళ్లలో కొందరు పిల్లల చదువుల కోసమని సిటీలోనే ఉండి చాయ్​ బండ్లు, చిన్న చిన్న కిరాణాషాపులు నడుపుకొని జీవితం నెట్టుకొస్తున్నారు. ఇంకొందరు కూరగాయల వ్యాపారాలు చేసుకుంటున్నారు. మరికొందరు ఊర్లకు పోయి ఏదో రకంగా బతుకు బండీ లాగిస్తున్నారు. తమ సొంత వాహనాలతో క్యాబ్​లు నడుపుతున్న డ్రైవర్లు ఈఎంఐలు కట్టుకోలేక క్యాబ్​లను అమ్మేసుకున్నారు. ప్రైవేటుగా ట్రావెల్స్ , ఆటోలు నడుపుకుందామన్నా  పని దొరకడం లేదు. ఐటీ కంపెనీల్లోని  సెక్యూరిటీ గార్డులు, కెఫ్‌టేరియా వర్కర్లు, మెకానిక్​లు, ఎలక్ట్రీషియన్లు.. ఇట్ల సాఫ్ట్​ సర్వీసుల వాళ్లంతా పనులు లేక దిక్కులు చూస్తున్నారు. 

ఆఫీసుకు రాలేమంటున్న ఐటీ ఉద్యోగులు
నిరుడు కరోనా ఎంటరైనప్పటి నుంచి ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్​తోనే నడిపిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల మొదట్లో కంపెనీ మేనేజ్మెంట్లు, ఎంప్లాయీస్ కొంత ఇబ్బంది పడ్డా ఇప్పుడు అందరూ  అలవాటు పడ్డారు. కరోనా కాలంలో ఇదే సేఫ్ సైడ్​గా భావిస్తున్నారు. ఎంప్లాయీస్ కూ  అనుకూలంగా ఉండటం, కంపెనీలకు వర్క్ వస్తుండటంతో ఇదే సాఫీగా సాగుతోంది. ఇతర రంగాలన్నీ ఓపెన్​ అవుతున్నా ఐటీ కంపెనీల ఆఫీసులు ఓపెన్​ కావడం లేదు. వాస్తవానికి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అన్​లాక్​లో  5– 10 శాతం మంది ఇంపార్టెంట్ పోర్ట్ ఫోలియో ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే ఆఫీస్ లకు వెళ్లారు. సెకండ్​ వేవ్​ ముగిసే సమయానికి దశల వారీగా దీన్ని 15–25 శాతం పెంచాలనుకున్నారు. వ్యాక్సిన్​ అందుబాటులోకి రావడంతో ఈ ఆగస్టు నాటికి 30–50 శాతానికి అటెండెన్స్​ పెంచి, ఇయర్​ ఎండింగ్​ వరకు 100 శాతం వర్క్​ ఫ్రమ్​ ఆఫీస్​గా మార్చాలని కంపెనీలు భావించాయి. కానీ సెకండ్​ వేవ్​లో యూత్​పై వైరస్​ ఎక్కువ ప్రభావం చూపడం, మరణాలు ఎక్కువగా ఉండటంతో దీన్ని వాయిదా వేసుకున్నాయి. ఐటీ కంపెనీలకు థర్డ్ వేవ్​పైనా భయాలు ఉండటంతో ఆఫీసులకు ఉద్యోగులను పిలవట్లేదు. రిస్క్​ చేస్తే కంపెనీలకే సమస్య వస్తుందని భావిస్తున్నాయి. నవంబర్​ వరకు వర్క్​ ఫ్రం​ హోమ్​ కంటిన్యూ చేయాలని ఉద్యోగులకు మెయిల్స్​ పంపాయి. కొన్ని కంపెనీలు ఆఫీసులకు వచ్చి పని చేస్తారా అని సర్వేలు చేస్తే ఉద్యోగులు రాలేమన్నారు. బలవంతంగా రావాలంటే ఉద్యోగాలు మానేస్తామని కూడా కొందరు చెప్పినట్లు ఓ కంపెనీ హెచ్​ఆర్​ తెలిపారు. ఉద్యోగులను ఆఫీసులకు పిలిపించాలని కంపెనీలతోపాటు సాఫ్ట్​ సర్వీసుల్లో ఉండే కంపెనీలు కూడా ప్రయత్నం చేశాయి. మెగా వ్యాక్సినేషన్​ డ్రైవ్​లు చేపట్టాయి.అయినా మెజారిటీ ఐటీ ఉద్యోగులు  వర్క్​ ఫ్రం​ హోంకే ఓటేశారు. దీంతో సాఫ్ట్​ సర్వీసెస్​లోని వాళ్లకు ఇప్పట్లో ఐటీ కంపెనీల్లో పనులు దొరికే అవకాశం లేకుండాపోయింది. కరోనా వల్ల తమ బతుకులు ఆగమయ్యాయని, తమను ఆదుకునే దిక్కు లేకుండా పోయిందని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

చిరుద్యోగులైనా బతుకుపై భరోసా ఉండేది
సాఫ్ట్​సర్వీసుల్లో పని చేసే వాళ్లు చిరుద్యోగులే. వచ్చే కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకునే వాళ్లే. ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు, ఇతర ఖర్చులతో జాగ్రత్తగా బతుకులు వెళ్లదీసే వాళ్లే. ఐటీ ఇండస్ట్రీలో ఎక్కువ డిమాండ్ ఉన్న అతిపెద్ద సర్వీస్ హౌస్​ కీపింగ్. క్లీనింగ్, నీట్ నెస్, ఆఫీస్ బాయ్ సర్వీసెస్ ఇందులో ఉంటాయి. ఒక్కో ఆఫీస్ లో బిల్డింగ్​ను బట్టి వంద నుంచి 3 వందల మంది వరకు హౌస్​ కీపింగ్ స్టాఫ్ ఉంటారు. హైదరాబాద్​లోని మొత్తం 3 వేల ఐటీ కంపెనీల్లో దాదాపు 6 లక్షల మంది హౌస్​ కీపింగ్​ స్టాఫ్​ ఉంటారు. కరోనా ఎఫెక్ట్​తో ఏడాదిన్నర నుంచి కంపెనీలు మూతబడి వీళ్లంతా రోడ్డునపడ్డారు. ప్రస్తుతం కొన్ని కంపెనీలు రీఓపెన్ అయినా పది పదిహేను శాతం హౌస్​ కీపింగ్ సిబ్బందిని కూడా పనుల్లోకి తీసుకోవడం లేదు. మిగతా వారిలో ఒక్క శాతం మంది అపార్ట్​మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో పనిచేసుకుంటున్నారు.

ఇంటి కిరాయి కూడా కట్టలేకపోతున్న
చేతుల పైసల్లేక ఇంటి కిరాయి కూడా కట్టలేకపోతున్న. నిరుడు లాక్​డౌన్​కు ముందు వరకు హైటెక్ సిటీలోని ఓ ఎంఎన్​సీలో క్యాబ్ డ్రైవర్ గా చేసేవాడ్ని. వచ్చే జీతం మీదనే కుటుంబమంతా ఆధారపడి ఉండేది. ఐటీ ఉద్యోగుల  వర్క్ ఫ్రమ్ హోమ్​తో మాకు పనులు కరువైనయ్​. డ్రైవర్ల పరిస్థితి ఏందని పట్టించుకునెటోళ్లే లేరు. గవర్నమెంట్ కు కూడా మా గోస పట్టదు. కార్లకు ఈఎంఐలు కట్టుకోలేక చాలా మంది వాటిని అమ్మేసుకున్నరు. 
‑ జాన్, క్యాబ్ డ్రైవర్

కంపెనీలు ఓపెన్ అయితేనే పని
హైదరాబాద్​ ఐటీ సెక్టార్ లో 6 లక్షల మంది డైరెక్ట్ ఎంప్లాయీస్ ఉంటే 20 లక్షల మంది ఇన్ డైరెక్ట్  ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ ఇన్​డైరెక్ట్​ ఎంప్లాయీస్​ను సాఫ్ట్ సర్వీసెస్ అంటాం. కరోనా ఎఫెక్ట్​తో వీళ్లంతా ఉపాధి కోల్పోయారు. ప్రస్తుతం కొన్ని కంపెనీలు రీఓపెన్ అయినా ఐటీ ఎంప్లాయీస్​ వర్క్​ ఫ్రం హోమ్​కే  ఇష్టపడుతున్నారు. దీంతో సాఫ్ట్​ సర్వీసెస్​ ఎంప్లాయీస్​కు పని దొరకడం లేదు.   
- సత్యనారాయణ, టీఎఫ్ఎంసీ అధ్యక్షుడు 

ఫికర్ పట్టుకుంది

నేను ఓ ఐటీ కంపెనీలో సెక్యూరిటీ డిపార్ట్​మెంట్ లో పనిచేసేవాడ్ని. నిరుడు జాబ్నేను ఓ ఐటీ కంపెనీలో సెక్యూరిటీ డిపార్ట్​మెంట్ లో పనిచేసేవాడ్ని. నిరుడు జాబ్ పోయినంక రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టుకున్న. గిరాకీ సరిగ్గా వచ్చేదికాదు. మా అబ్బాయి, అమ్మాయిల చదువుల ఫీజులు గతేడాది నుంచి కట్టలేదు. ఈమధ్యనే ఒక విల్లాకు సెక్యూరిటీ గా చేరిన. ఆ జీతం ఇంటి ఖర్చులకే సరిపోతున్నది. వేలకు వేలు పిల్లల ఫీజులు కట్టాలి. లేకపోతే వాళ్ల భవిష్యత్తు ఏమైతదోనని ఫికర్​ పట్టుకుంది.  
- శ్రీనివాస్ , సెక్యూరిటీ గార్డ్

రోడ్డున పడ్డం

20 ఏండ్ల నుంచి హౌస్​ కీపింగ్ పనిచేస్తున్నా. ఒరాకిల్ కంపెనీలో ఆఫీస్ బాయ్ గా చేస్తూ ఆ టీమ్ కి అడ్మిన్ అయిన. నాతో పాటు ఇంకో 100 మంది పనిచేసేవాళ్లు. నిరుడు కరోనా ఎఫెక్ట్​తో కంపెనీని మూసేశారు. నాతోపాటు హౌస్​ కీపింగ్​లోని అందరం రోడ్డునపడ్డాం. మా ఇంట్లో నేను, నా భార్య, అమ్మ, నలుగురు పిల్లలం ఉంటాం. నేను సంపాదిస్తేనే ఇల్లు గడిచేది. కంపెనీ మూతపడటంతో ఇంట్లోని ముందు రూమ్ లో కిరాణా షాప్ పెట్టుకొని బతుకుబండి లాగిస్తున్నాం. 
 -వీరయ్య, హౌస్​ కీపింగ్​

మస్తు సఫర్​ అయితున్నరు
హైదరాబాద్​లో ఐటీ కంపెనీలకు 12 వేల క్యాబ్ లు పనిచేస్తున్నాయి. ఇందులో పనిచేసే డ్రైవర్లకు రూ. 35 వేల నుంచి 45 వేల జీతం ఉంటుంది. ఇందులో డీజిల్​కు  నెలకు 15వేలపైనే పోతుంది. మిగతా జీతంలో ఈఎంఐలు వంటి ఖర్చులతోనే సరిపోతుంది. ప్రస్తుతం కొన్ని కంపెనీలు ఓపెన్ అయినా ఐటీ ఎంప్లాయీస్  సొంత వాహనాల్లోనే  ఆఫీస్ లకు వెళ్తున్నారు. అందుకే క్యాబ్ సర్వీసెస్ పూర్తిగా నిలిచిపోయాయి. చాలామంది కార్లు అమ్మేసుకున్నారు. ఫైనాన్స్ లు కట్టలేక కంపెనీలకు హ్యాండ్ ఓవర్  చేశారు. ఉపాధి లేక సఫర్​ అవుతున్నారు. 
- శివ, క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్​ ప్రెసిడెంట్