జార్ఖండ్ సైబర్ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
ప్రధాన నిందితుడు పరార్.. అదుపులో ఐదుగురు
హైదరాబాద్ డాక్టర్ ఖాతా నుంచి ₹5 లక్షలు కొట్టేసిన ముఠా
ఆమె ఫిర్యాదుతో జార్ఖండ్‌లో 20 రోజులపాటు పోలీసుల మకాం
హైదరాబాద్, వెలుగు: గూగుల్‌తో ఏం చేయొచ్చు?… ఏదైనా చేయొచ్చు. ఏమైనా తెలుసుకోవచ్చు. నాలెడ్జ్ పెంచుకోవచ్చు. కానీ, జార్ఖండ్‌కు చెందిన ఓ గ్యాంగ్ మాత్రం జనాల డబ్బులను కొట్టేసేందుకు ‘గూగుల్’ను వాడుకుంది. గూగుల్ పేరిట ‘ఫిషింగ్(ఎర వేయడం లాంటిది)’ లింకులు పంపి అందిన కాడికి డబ్బులు కాజేసింది. పోలీసులకు దొరికిపోయింది. ఆరుగురు సభ్యుల ముఠాలోని ఐదుగురిని జార్ఖండ్‌లో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను డీసీపీ క్రైమ్స్ ప్రియదర్శిని, సైబర్‌క్రైమ్ ఏసీపీ సీహెచ్‌వై శ్రీనివాస్కుమార్లతో కలిసి సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిందన్న పేరుతో అన్ని వివరాలనూ తెలుసుకుని డబ్బులు కాజేస్తున్నారని తెలిపారు. నిందితుల దగ్గర్నుంచి రూ.2.66 లక్షలు, బంగారు గొలుసు, 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు.
డాక్టర్ ఫిర్యాదుతో
అక్టోబర్ 21న హైదరాబాద్‌లోని ఓ డాక్టర్‌కు QP–SBINBS పేరిట ఓ మెసేజ్ వచ్చింది. ఆమె ఆ మెసేజ్ ఓపెన్ చేసింది. ‘‘డియర్ కస్టమర్.. మీ సేవింగ్స్ అకౌంట్, డెబిట్ కార్డు సర్వీసు బ్లాక్ అయింది. మార్చి నెల బ్యాంక్ స్టేట్మెంట్, కేవైసీ వెరిఫికేషన్ ముంబై ఆర్బీఐకి సబ్మిట్ చేయలేదు. అకౌంట్ తిరిగి పనిచేయాలంటే లింక్‌ను క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్ నంబర్, కేవైసీతో పాటు పూర్తి వివరాలు పంపండి” అంటూ ఆ మెసేజ్‌లో ఉంది. దీంతో ఆమె ఆ లింక్‌ను క్లిక్ చేసింది. అన్ని నంబర్లతో పాటు డెబిట్‌కార్డ్ పిన్, పాస్‌వర్డ్‌లనూ పంపింది. అంతే, ఆ తర్వాతి రోజు ఆమె అకౌంట్ నుంచి వివిధ ఈ–వాలెట్లకు ₹5.29 లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. మోసపోయానని గుర్తించిన ఆమె సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసిన ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని సైబర్ క్రైమ్‌టీమ్, ఈ–వాలెట్ నంబర్ల ఆధారంగా జార్ఖండ్‌లోని జాంతార్కు చెందిన సైబర్ దొంగల ముఠా పనిగా గుర్తించింది. కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్‌కుమార్ మండల్ అలియాస్ బబ్లూ గ్యాంగ్, దోచేసిన సొమ్ముతో ప్రముఖ నగల దుకాణాలు, ఇతర షాపింగ్‌మాల్స్ నుంచి ఈ–వోచర్లు కొన్నారని సైబర్‌క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఆ వోచర్లతో వివిధ రాష్ట్రాల్లో బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఏసీలు కొనుగోలు చేసినట్టు తేల్చారు. డాక్టర్ నుంచి కొట్టేసిన డబ్బుతో అక్టోబర్ 22, 23 తేదీల్లో జార్ఖండ్‌లోని ధన్బాద్, బొకిరోలోని తనిష్క్ జువెలర్స్‌లో నగలు కొన్నట్టు పోలీసులు గుర్తించారు. 20 రోజుల పాటు జాంతార్లో మకాం వేసి ఆ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
చదివింది ఏడే..
ఈ గ్యాంగ్‌లోని సభ్యులంతా జార్ఖండ్‌లోని నారాయణపూర్, జాంతార్, కర్మటర్ పోలీస్స్టేషన్ల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందినోళ్లు. అక్కడ చదువుకున్నోళ్లు చాలా తక్కువ. ఇందులో ఏడు నుంచి పది వరకు చదివినోళ్లే ఆన్లైన్ మోసాల బాట పడుతున్నారు. ఓటీపీ, ఫిషింగ్ కాల్స్‌తో కొల్లగొడుతున్నారు. అయితే, వాటి వల్ల పోలీసులకు వెంటనే దొరికిపోతుండడంతో 2016 నుంచి రూట్ మార్చారు. ఈ–వాలెట్ రూటుతో గూగుల్ లింకులు పంపి డబ్బు దోచేయడానికి ప్లాన్ వేశారు. అందుకు కొన్ని కుటుంబాలు గ్యాంగ్‌గా ఏర్పడ్డాయి. జాంతార్కు చెందిన సంజయ్ కుమార్ మండల్ మరో ఐదుగురితో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. ఇందులో కర్మటర్ కు చెందిన రామ్ కుమార్ మండల్‌తో పాటు ధర్మాపూర్‌కు చెందిన జమ్రూద్దీన్ అన్సారీ, చుగ్లోకు చెందిన బిరేంద్ర కుమార్ మండల్, బీహార్ కరుణ్భాగ్కు చెందిన రోహిత్రాజ్లున్నారు. ఇందులో జమ్రుద్దీన్ అన్సారీ బ్యాంక్ అకౌంట్లను సేకరించేవాడు. అతడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్టులో ఉన్నాడు. ఆ డేటా ఆధారంగా నకిలీ లింకులను తయారు చేసి జనాన్ని ట్రాప్‌లో పడేసేవాడు సంజయ్. కాగా, సైబర్ నేరాల్లో సంజయ్ గ్యాంగ్ నైజీరియన్లను మించిపోయిందని, సరిగ్గా ఇళ్లు కూడా లేని ఆ గ్యాంగ్ ఇప్పుడు విలాసవంతమైన బంగళాల్లో ఉంటోందని సైబర్ క్రైమ్ ఏసీపీ సీహెచ్‌వై శ్రీనివాస్‌కుమార్ తెలిపారు. పోలీసులు పట్టుకున్నా డబ్బు దొరక్కుండా ఉండేందుకు భూములు, ఇళ్లు కొనేస్తున్నారని చెప్పారు.

