లక్షలు పెట్టి కొని మూలకు పడేసిన్రు .. మున్సిపాలిటీలో వృథాగా పడి ఉన్న వాహనాలు

లక్షలు పెట్టి కొని మూలకు పడేసిన్రు .. మున్సిపాలిటీలో వృథాగా పడి ఉన్న వాహనాలు
  • మెయింటెనెన్స్, రిపేర్ల ఊసెత్తని ఆఫీసర్లు
  • కనిపించకుండా పోయిన గుంతలు తవ్వే మెషీన్

గద్వాల, వెలుగు: ప్రజల సొమ్ముతో లక్షల రూపాయలు పెట్టి కొన్న మెషీన్లను వాడకుండా గద్వాల మున్సిపాలిటీలో మూలకు పెట్టేసిన్రు. రిపేర్లు చేయించకపోవడం, కొన్న మెషీన్లను మెయింటెనెన్స్ చేయకపోవడం, కొన్నింటిని ఓపెన్ కూడా చేయకపోవడంతో లక్షలు విలువ చేసే మెషీన్లు తుప్పు పడుతున్నాయి. గద్వాల మున్సిపాలిటీలో రూ.45 లక్షలతో స్వీపింగ్  మెషీన్, రూ.23 లక్షలతో నాలా క్లీనింగ్  మెషీన్, రూ.24 లక్షలతో జేసీబీ, రూ.10 లక్షలతో డోజర్, రూ.5 లక్షలతో కరెంట్​ పోల్స్  కోసం గుంతలు తవ్వే మెషీన్లు కొన్నారు. అవన్నీ ఇప్పుడు మెయింటెనెన్స్  లేక మూలకుపడ్డాయి.

రిపేర్లు చేయరు..

లక్ష రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన మెషీన్లను పాలకపక్షం, ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో తుప్పుపడుతున్నాయనే విమర్శలున్నాయి. రెండేండ్ల కింద రూ.45 లక్షలతో స్వీపింగ్  మెషీన్  కొన్నారు. దానికి 6 నెలలకు రూ. లక్షల వరకు మెయింటెనెన్స్  కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. బ్రష్ లు, ఇతర సామగ్రి ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. మెయింటెనెన్స్ కు డబ్బులు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం అది మున్సిపాలిటీలో వృథాగా పడి ఉంది. జేసీబీ, డోజర్  సైతం ఆయిల్  చేంజ్  తదితర చిన్నచిన్న పనులు చేయించకపోవడంతో మూలకుపడ్డాయి.

కొన్నా ఓపెన్  చేయలే..

మూడేండ్ల కింద రూ.23 లక్షలతో నాలా క్లీనింగ్  మెషీన్ ను కొనుగోలు చేశారు. దాన్ని ఇప్పటివరకు ఓపెన్  కూడా చేయలేదంటే ఆఫీసర్లు, పాలకవర్గం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని ఓపెన్  చేయాలన్నా, పని చేస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రూ.23 లక్షలు డ్రైనేజీలో పోసినట్లు అయిందని అంటున్నారు.

ఇదిలాఉంటే రూ.5 లక్షలతో కొన్న గుంతలు తవ్వే మెషీన్​ కనిపించకుండా పోయిందని చెబుతున్నారు. దాన్ని స్క్రాప్ కు అమ్మారా? లేదా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా తీసుకెళ్లారా? అనే విషయం మున్సిపాలిటీ వారికి కూడా తెలియని పరిస్థితి ఉంది. చెత్త సేకరణ కోసం లక్షలు పెట్టి కొన్న ఆటోలు సైతం ప్రైవేట్​ ఏజెన్సీ వారికి అప్పగించడంపై విమర్శలు వస్తున్నాయి. చెత్త సేకరణను ప్రైవేట్  ఏజెన్సీకి అప్పగించగా, వారు ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. అలాంటి వారికి మున్సిపాలిటీ ఆటోలు ఎలా ఇస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

వినియోగంలోకి తెస్తాం..

పట్టణంలో పనులు చేసేందుకు వెహికల్స్, స్వీపింగ్, నాలా క్లీనింగ్  మెషీన్లు కొన్న మాట వాస్తవమే. మెయింటెనెన్స్  డబ్బులు కేటాయించేందుకు ప్రపోజల్స్​ పెడతాం. రిపేర్లు చేయించి అన్నింటినీ వినియోగంలోకి తెస్తాం

సందీప్, డీఈ, గద్వాల మున్సిపాలిటీ