అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి మృతి.. స్వగ్రామం రావురూకులలో విషాదం

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి మృతి.. స్వగ్రామం రావురూకులలో విషాదం

సిద్దిపేట/దుండిగల్, వెలుగు: అమెరికాలోని చికాగోలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువతి లక్కరసు శ్రీజ వర్మ (23) మృతి చెందారు. ఈస్టర్న్ ఇల్లినాయిస్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసిన శ్రీజ.. ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నది. చికాగోలోని అర్బనా ప్రాంతంలో ఉంటున్న ఆమె సోమవారం తన అపార్ట్‌‌‌‌మెంట్ సమీపంలోని రెస్టారెంట్‌‌‌‌లో భోజనం చేసి తిరిగి వస్తుండగా, వేగంగా వచ్చిన ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనాస్థలంలోనే మృతి చెందింది.

సిద్దిపేట రూరల్ మండలంలోని రావురూకుల గ్రామానికి చెందిన శ్రీజ తల్లిదండ్రలు శ్రీనివాస్ వర్మ, హేమలత కొన్ని సంవత్సరాల క్రితం మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధిలోని బాలాజీ నగర్, గండిమైసమ్మ ఏరియాకు వచ్చి స్థిరపడ్డారు. వారి పెద్ద కుమార్తె అయిన శ్రీజ, ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. ఈ ఘటనతో ఆమె స్వగ్రామం రావురూకులలో విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రీజ మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.