చిన్న తప్పులతో పెద్ద ముప్పు తెచ్చుకోకండి

చిన్న తప్పులతో పెద్ద ముప్పు తెచ్చుకోకండి
  • చిన్న చిన్న తప్పులతో.. పెద్ద ముప్పు తెచ్చుకోకండి
  • లాల్‌ దర్వాజ గుడి దగ్గర రంగంలో స్వర్ణలత, అనురాధ

హైదరాబాద్, వెలుగు: చిన్న చిన్న తప్పులతో ప్రజలు పెద్ద ముప్పు తెచ్చుకోవద్దని, ఎంత వరకు కాపాడాలో అంతవరకే రక్షిస్తామని ఓల్డ్​సిటీ రంగంలో స్వర్ణలత, అనురాధ భవిష్యవాణి వినిపించారు. ఓల్డ్​ సిటీ బోనాల ఉత్సవాల్లో భాగంగా లాల్ దర్వాజ, మిరాలం మండి, అక్కన్నమాదన్న, ఉప్పుగూడ మహంకాళి దేవాలయాల వద్ద సోమవారం రంగం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాల్ దర్వాజ సింహవాహిని, ఉప్పుగూడ మహంకాళి, అక్కన్నమాదన్న ఆలయాల వద్ద అనురాధ భవిష్యవాణి వినిపించారు. ‘చిన్న చిన్న తప్పులు చేసి పెద్ద ముప్పులు తెచ్చుకుంటున్నారు. మిమ్మల్ని నేను చల్లంగా చూసుకునే దానని, మున్ముందు దీనికన్న (కరోనా) పెద్దరోగం వచ్చేది ఉంది. ఎంత వరకు కాపాడాలో అంతవరకే రక్షిస్తా.  కుండ నిండిన తరువాత నీళ్లు జారిపడక తప్పదు. నన్ను కొలువండి ఎంతటి రోగాలనైనా పారదోలుతా’నని చెప్పింది. మిరాలంమండి మహంకాళేశ్వరి ఆలయంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అన్ని చేసినా ధన్వంతరి హోమం ఎందుకు చేయలేదని ప్రశ్నించింది. రానున్నకాలంలో కరోనా అంతమవుతుందని, కానీ జనం మాత్రం సామాజిక దూరం పాటించాలని చెప్పింది. ఎన్నిరోగాలు వచ్చినా మిమ్మల్ని కాపాడుతున్నది నేనేనని, ప్రజలందరు సుఖసంతోషాలతో ఉంటారని పేర్కొంది. భవిష్యవాణి తరువాత  ఘటాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు.