
- లండన్‌లోని తన నివాసంలో పార్టీ ఇచ్చిన లలిత్ మోదీ
- మాల్యా, క్రిస్ గేల్‌తో పాటు 310 మంది ఈ పార్టీకి హాజరు
న్యూఢిల్లీ: ఇండియాలో బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు లలిత్ మోదీ, విజయ్ మాల్యా లండన్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ‘ఐ డిడ్ ఇట్ మై వే..’ అంటూ పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ వీకెండ్‌ను ఆస్వాదిస్తున్నారు. లండన్‌లోని లలిత్ మోదీ నివాసంలో ‘యాన్యువల్ సమ్మర్ పార్టీ’ పేరుతో వీకెండ్ ప్రైవేట్ పార్టీ నిర్వహించారు.
దీనికి కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాతో పాటు మరో 310 మంది ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు హాజరయ్యారు. వివిధ దేశాల నుంచి కూడా పలువురు అతిథులు ఈ విందుకు వచ్చారు. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ కూడా ఉన్నాడు. లలిత్, మాల్యాతో ఫొటో దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘ఈ సాయంత్రాన్ని ఆనందంగా మార్చినందుకు ధన్యవాదాలు’ అని క్యాప్షన్ పెట్టాడు.
ఈ ఫంక్షన్‌లో ‘ఐ డిడ్ ఇట్ మై వే..’ పాటను లలిత్ మోదీ, విజయ్ మాల్యా కలిసి పాడి, అతిథులను అలరించారు. దీనికి సంబంధించిన వీడియోను లలిత్ మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అది వైరల్‌గా మారింది. ‘‘310 మంది ఫ్రెండ్స్, కుటుంబసభ్యులతో అద్భుతమైన రాత్రి గడిపాను. ఈ విందు కోసం పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు.
మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ రాత్రిని నాకు ప్రత్యేకంగా మార్చారు. ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేయకపోవచ్చని నేను ఆశిస్తున్నాను. కానీ, వివాదాస్పదమవుతుందని అనుకుంటున్నాను”అని చెప్పారు. కాగా, ఐపీఎల్ స్కామ్‌లో వేల కోట్లు దోచుకొని 2010లో లలిత్ మోదీ దేశం నుంచి పారిపోయారు. అలాగే, బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి మనీ లాండరింగ్ కేసులో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యా 2016లో దేశం నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ లండన్‌లో ఉంటున్నారు.