హుస్నాబాద్లో ఇండస్ట్రీయల్ పార్క్.. మంత్రి చొరవతో వేగంగా అడుగులు

హుస్నాబాద్లో ఇండస్ట్రీయల్ పార్క్..  మంత్రి చొరవతో వేగంగా అడుగులు
  • భూసేకరణకు డిక్లరేషన్​ జారీ
  • పరిహారాల అంశంపై రైతులతో చర్చలు

సిద్దిపేట/హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్ నియోజకవర్గ యువతకు ఉపాధి కల్పించేందుకు ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు జరగనుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ఇండస్ట్రీయల్ పార్క్ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. పార్క్​ ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూసేకరణ కోసం 15 రోజుల కిందటే అధికారులు డిక్లరేషన్​ ప్రకటించారు. హుస్నాబాద్, అక్కన్న పేట మండలాల పరిధిలో 124.36 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. అవసరమైతే భవిష్యల్​లో విస్తరించేందుకు వీలుగా భూసేకరణ చేపట్టాలని భావిస్తున్న అధికారులు.. ఇప్పటికే సర్వే చేశారు. టీజీఐఐసీ అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో భూములను పరిశీలించారు. 

హుస్నాబాద్ మండలం తోటపల్లిలో 25.20 , అక్కన్నపేట మండలం చౌటపల్లిలో 83.36, జనగామలో 15.26 ఎకరాలను సేకరించనున్నారు. చౌటపల్లిలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండగా.. మిగిలిన రెండు గ్రామాల్లో పట్టా భూములను సేకరిస్తున్నారు. పరిహారాలకు సంబంధించి రైతులతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. అయితే .. పరిహారం ఎంతో తేల్చిన తర్వాతే భూములు తీసుకోవాలని రైతులు అంటున్నారు. పార్క్ కోసం ఎంపిక చేసినచోట అసైన్డ్ భూములున్న రైతులు, పట్టాలు లేకున్నా పోజిషన్ లో ఉన్నవారు తమ సంగతి ఏంటో చెప్పాలని కోరుతున్నారు. 

కాలుష్యం లేని పరిశ్రమలకే మొగ్గు 

చౌటపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రీయల్ పార్క్ లో కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే కాలుష్యం అసలే ఉండని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలని స్థానికులు సూచిస్తున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో వరి, పత్తి, మొక్కజొన్న , పప్పు దినుసుల సాగు ఎక్కువగా ఉంది. గౌరవెల్లి ప్రాజెక్టు కూడా ప్రారంభమైతే ఇక్కడ కూరగాయల సాగు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. 

దీంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే ఇక్కడి రైతులకు కూడా మేలు కలుగుతుంది. ఈ ప్రాంతం కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ జిల్లాలకు దగ్గరగా వుండటం, హుస్నాబాద్ మీదుగా నేషనల్ హైవే నిర్మాణం పూర్తికానుండడంతో రవాణా సౌకర్యాలు కూడా మెరుగు పడనున్నాయి. నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరిస్తున్న కొత్తపల్లి, జనగామ రోడ్డు కు చాలా దగ్గరలోనే పార్క్​ఏర్పాటు కానుంది. కరీంనగర్, సిద్దిపేట రైల్వే స్టేషన్లు దాదాపు 40 కిలో మీటర్ల లోపే ఉన్నాయి.

ఉపాధికి అవకాశాలు

ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు తో హుస్నాబాద్, కోహెడ, అక్కన్న పేట మండలాల్లోని యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఉపాధి కోసం ఇక్కడ నుంచి దూరప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి తప్పుతుంది. వ్యవసాయం తప్ప ఇతర ఉపాధి అవకాశాలు లేని హుస్నాబాద్ ప్రాంతంలో కొత్తగా పరిశ్రమలు వస్తే యువతకు మంచిరోజులు వస్తాయని స్థానికులు సంతోషిస్తున్నారు. ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు దిశగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. 

భూములు కోల్పొతున్న రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామని, వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇస్తున్నారు. భూసేకరణకు సంబంధించి డిక్లరేషన్ విడుదల చేశామని, భూముల పరిహారాల గురించి రైతులతో చర్చిస్తున్నామని హుస్నాబాద్ ఆర్డీఓ రామమ్మూర్తి చెప్పారు. రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు.