ఉప్పల్ ఫ్లైఓవర్ ఆలస్యానికి.. భూసేకరణే ప్రధాన సమస్య

ఉప్పల్ ఫ్లైఓవర్ ఆలస్యానికి.. భూసేకరణే ప్రధాన సమస్య

కాంట్రాక్ట్ సంస్థ దివాళాతో ఆర్థికంగా ఇబ్బందులు 
కేంద్రంపై నెపం నెడ్తూ గత బీఆర్ఎస్ సర్కార్ నిందలు
ఆర్టీఐ దరఖాస్తుతో వెల్లడైన అసలు నిజాలు

హైదరాబాద్, వెలుగు: ఉప్పల్ ​ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యం కావడానికి సంబంధిత కాంట్రాక్ట్ సంస్థ బ్యాంకులకు రూ.6వేల కోట్లు ఎగ్గొట్టి దివాళా తీయ డమే కారణమని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుపై ఆర్టీఐ యాక్టివిస్టు, అడ్వకేట్​ గుమ్మి రాజ్​కుమార్​రెడ్డి పూర్తి సమాచారాన్ని సేకరించడంతో అసలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉప్పల్ నుంచి నారపల్లి వరకూ 6 లేన్లతో ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో 2018, జులైలో పనులు ప్రారంభించారు. మొత్తం 6.25 కిలో మీటర్ల పొడవున ఫ్లైఓవర్ కట్టేందుకు కేంద్రం రూ. 675 కోట్లను కేటాయించింది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్​మెంట్​అండ్ కన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్(ఈపీసీ) పద్ధతిలో వంతెన నిర్మించేందుకు గాయత్రి ప్రాజెక్ట్స్ సంస్థ కాంట్రాక్ట్​ను దక్కించుకుంది. రెండేండ్లలో 2020, జులైలోపు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అంగీకరించింది. కానీ ఐదేండ్లు అవుతున్నా ఇప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

 దీంతో ఉప్పల్, రామంతాపూర్ ప్రాంతాల్లో రోజూ గంటల తరబడి ట్రాఫిక్ జాం అవుతూ వాహనదారులు నరకం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అడ్వకేట్ రాజ్​కుమార్ రెడ్డి ఆర్టీఐ కింద సమాచారం సేకరించడంతో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటివరకు 42 శాతం పనులే పూర్తయినట్టు కాంట్రాక్ట్ సంస్థ అంగీకరించింది. భూసేకరణ, మతపరమైన నిర్మాణాల తొలగింపు ప్రధాన సమస్యగా ఉందని ప్రభు త్వం తెలిపింది. కాంట్రాక్ట్ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు పేర్కొంది. 2024, ఆగస్టు ఆఖరునాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు గడువును పొడిగించినట్లు వెల్లడించింది. అయితే, కేంద్రం నుంచి నిధులు రాకనే ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యం అవుతోందంటూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సార్లు చెప్పుకొచ్చింది.