- తమ్ముడి ఇంటి ఎదుట మూడు రోజులుగా డెడ్‌బాడీతో ఆందోళన
- తమ భూమి తమకు రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్
- పోలీసులు నచ్చజెప్పినా వినిపించుకోని కుటుంబీకులు
- హనుమకొండ జిల్లా అన్నసాగర్ లో ఘటన
హసన్ పర్తి, వెలుగు : పెద్దల నుంచి వచ్చిన భూమి పంపకం విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం తలెత్తింది. తనకు రావాల్సిన భూమిని తమ్ముడు పట్టా చేయించుకున్నాడని, పెద్ద మనుషులు కూడా వేధిస్తున్నారని అన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కారకులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబసభ్యులు డెడ్ బాడీతో తమ్ముడి ఇంటి ఎదుట మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం అన్నసాగర్ కు చెందిన బండ శ్రీనివాస్ రెడ్డి, -సరోజనకు మహేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి కొడుకులు. వీరికి ఏడెకరాలుండగా పంపకాల విషయంలో కొన్నేండ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి.
ఇద్దరికీ చెరో 3.20 ఎకరాలు రావాల్సి ఉండగా, తమ్ముడైన ప్రభాకర్ రెడ్డి తన అన్నకు రావాల్సిన 3.20 ఎకరాలను కూడా గుట్టుచప్పుడు కాకుండా 2018లోనే తనతో పాటు తన భార్య జ్యోతి, కొడుకు సాయినాథ్ రెడ్డి పేరున పట్టా చేయించుకున్నాడు. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. చాలాసార్లు హసన్ పర్తి పీఎస్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో గ్రామ పెద్ద మనుషులైన తాజా మాజీ వైస్ ఎంపీపీ బండ రత్నాకర్ రెడ్డి, రామంచ సాయిలును మహేందర్ ఆశ్రయించాడు. తమకు డబ్బులిస్తే ప్రభాకర్ రెడ్డితో మాట్లాడి భూమి పట్టా చేయించేలా చేస్తామని చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన మహేందర్ రెడ్డి గురువారం ఇంట్లో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్చడంతో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం చనిపోయాడు.
తమ్ముడి ఇంటి ముందు ఆందోళన
మహేందర్ రెడ్డి ఆత్మహత్యకు ప్రభాకర్ రెడ్డితో పాటు అతడి భార్య, కొడుకు, పెద్ద మనుషులు కారణమంటూ మృతుడి భార్య పద్మ హసన్ పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ భూమి తమకు పట్టా చేయించడంతో పాటు మహేందర్ రెడ్డి చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాత్రి డెడ్ బాడీతో ప్రభాకర్ రెడ్డి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. దీంతో హసన్ పర్తి సీఐ సురేశ్, పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, తమకు దక్కాల్సిన భూమి తమ కుటుంబసభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేంత వరకు మృతదేహాన్ని తీసేది లేదని బాధితులు అక్కడే బైఠాయించారు. తమ భూమిని తమకు రిజిస్ట్రేషన్ చేయకపోతే మహేందర్ రెడ్డి మృతదేహానికి ప్రభాకర్ రెడ్డి ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. దీంతో ఆదివారం హసన్ పర్తి, కమలాపూర్, కాజీపేట, ఎల్కతుర్తి స్టేషన్ల పోలీసులు అన్నసాగర్ గ్రామానికి చేరుకుని ఆందోళనను విరమింపజేసే ప్రయత్నం చేసినా..ఫలితం లేకపోయింది.
పోలీసులు వారికే సపోర్ట్ చేస్తున్నారని ఆరోపణ
మహేందర్ రెడ్డి మృతి చెందిన తర్వాత పెద్ద మనుషులైన తాజా మాజీ వైస్ ఎంపీపీ బండ రత్నాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ రామంచ సాయిలును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు మాత్రం ఇంటికి తాళం వేసి పరారయ్యారు. దీంతో బండ ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇదిలాఉంటే బండ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని కాపాడేందుకు పోలీసులే ప్రయత్నిస్తున్నారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. మహేందర్ రెడ్డి మృతి తరువాత ప్రభాకర్ రెడ్డి పోలీసులకు లొంగిపోయాడని, తర్వాత ఎట్లా తప్పించుకుంటాడని ప్రశ్నించారు. తమకు న్యాయం చేసేంత వరకు కదిలేది లేదని ఆందోళన కొనసాగించారు.