
- గొడ్డలితో నరికి ఒకరి హత్య
- మరొకరి పరిస్థితి విషమం, పలువురికి తీవ్ర గాయాలు
- రంగారెడ్డి జిల్లా దండుమైలారంలో ఘటన
ఇబ్రహీంపట్నం, వెలుగు:దాయాదుల మధ్య భూ వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారంలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. గుడేటి జంగయ్య నుంచి అతని వారసులు గుడేటి జంగయ్య, గుడేటి యాదయ్య, గుడేటి మల్లయ్య, గుడేటి నరసింహులకు దండుమైలారం రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్లు156, 158, 159లో 18 ఎకరాల 12 గుంటల భూమి ఉంది. గత కొన్నేండ్ల కింద భూ పంపకాలు జరిగాయి.
నరసింహ, యాదయ్యకు.. మల్లయ్య, జంగయ్య కన్నా 11 గుంటల భూమి అదనంగా వచ్చింది. దీంతో ఆ భూమి విషయంలో వారి మధ్య గతంలో పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ విషయంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు. ఆ భూమి వద్దకు ఎవరూ వెళ్లవద్దని పోలీసులు ఇరు పక్షాల వారిని హెచ్చరించారు. ఆదివారం ఉదయం యాదయ్య, నరసింహ కుటుంబ సభ్యులు ఆ భూమిలో పొలం పనులు చేస్తుండగా.. జంగయ్య, మల్లయ్యల వారసులు ధన్రాజు, బాలరాజు, వెంకట్ రాజు, పావని, మంజుల తదితరులు పొలంలోకి వెళ్లి అడ్డుపడ్డారు.
యాదయ్య, నరసింహల కుటుంబ సభ్యులైన శ్రీశైలం, లింగస్వామి, బాలరాజు, యాదయ్య, ప్రసాద్, అర్చన, పారిజాత, దేవకమ్మ, పద్మపై జంగయ్య, మల్లయ్యల వారుసులు దాడికి పాల్పడ్డారు. వెంటపెట్టుకొని వచ్చిన గొడ్డళ్లతో బాలరాజుని నరికేశారు. అలాగే వెంకటరాజు, పావని, మంజులపైనా గొడ్డళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాలరాజు (36) ను ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. మంజుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడ్డ మరో ఇద్దరు చికిత్సపొందుతున్నారు. దాడి చేసిన వారిపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.