భూవివాదాలే వారికి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్​

భూవివాదాలే వారికి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్​
  • జిల్లాలోని పలువురు తహసీల్దార్లపై అవినీతి మరకలు 
  • ఇటీవల నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసిన కేసులో తహసీల్దార్ చిల్ల శ్రీనివాస్ అరెస్ట్ 
  •  కొనుగోలుదారు రాకుండానే రిజిస్ట్రేషన్ చేసినందుకు వీణవంక తహసీల్దార్ పై వేటు 
  • తాజాగా జమ్మికుంట తహసీల్దార్ రజినీ ఇంట్లో సోదాలు 

కరీంనగర్, వెలుగు:  భూవివాదాలు, రికార్డుల్లో దొర్లిన తప్పులు కొందరు తహసీల్దార్లకు ఆదాయ వనరుగా మారింది. రికార్డులన్నీ సక్రమంగా ఉన్నా ఏదో ఒక కొర్రీ పెట్టి రిజిస్ట్రేషన్లు ఆపడం, పాస్ బుక్స్ జారీ చేయకపోవడం, చివరికి ఎంతో కొంత ముట్టజెప్పాకే పని చేసిపెట్టడం తహసీల్దార్లకు పరిపాటిగా మారింది. నకిలీ డాక్యుమెంట్లతో భూమిని ఆక్రమించిన కేసులో కొత్తపల్లి మాజీ తహసీల్దార్ చిల్ల శ్రీనివాస్ జైలు పాలుకాగా, అమెరికాలో ఉన్న పట్టాదారు రాకుండానే భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన ఘటనలో వీణవంక తహసీల్దార్ సస్పెండ్ అయ్యారు.

ఈ రెండు సంఘటనలు మరవకముందే తాజాగా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో జమ్మికుంట తహసీల్దార్ రజినీ ఇల్లు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి భారీగా ఆస్తి పత్రాలను గుర్తించడం జిల్లాలో కలకలం రేపుతోంది. తహసీల్దార్లపై వరుసగా అవినీతి ఆరోపణలు రావడం, కటకటాలపాలవుతుండడంతో మిగతా తహసీల్దార్లలో టెన్షన్ మొదలైంది. అవినీతి ఆఫీసర్ల జాబితాలో రేపు ఎవరివంతోనని ఆందోళనకు గురవుతున్నారు. 

భూసమస్యలతో తహసీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వస్తే అంతే.. 

తమ భూమి సమస్యపై బాధితులు రెవెన్యూ ఆఫీసులకు వస్తే కొందరు తహసీల్దార్లు.. ఆ సమస్యను పరిష్కరించేందుకు భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చిల్ల శ్రీనివాస్ కొత్తపల్లి తహసీల్దార్ గా పని చేసిన సమయంలో రేకుర్తిలో రఘు అనే వ్యక్తికి చెందిన 30 గుంటల భూమిని ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు తన పేరిట 3.250 గుంటల భూమిని(10 శాతం)ని  రాసివ్వాలని డిమాండ్ చేశాడు.

ఇందుకు రఘు ఒప్పుకోకపోవడంతో తహసీల్దార్ శ్రీనివాస్ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తన బినామీ అయిన సంతోష్ పేరిట 3.250 గుంటల భూమి మ్యుటేషన్ చేశాడు. అంతేగాక మరో భూమిని కూడా ఇదే పద్ధతిలో కబ్జాకు పాల్పడినట్లు కొత్తపల్లి పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేసు నమోదైంది. ఈ కేసులో తహసీల్దార్ శ్రీనివాస్ ను 14 రోజుల రిమాండ్ పై జైలుకు పంపారు. ఇదే పద్ధతిలో జిల్లాలో పలువురు తహసీల్దార్లు తమ దగ్గరికి వచ్చే భూవివాదాలను పరిష్కరించేందుకు భూమి విలువలో 10 శాతాన్ని డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  

ఓనర్​ అమెరికాలో ఉన్నా రిజిస్ట్రేషన్​

అమెరికాలో ఉంటున్న రామిడి శివప్రియ అనే మహిళకు చెందిన సుమారు రూ.2 కోట్ల విలువ చేసే 20 గుంటల భూమిని ఆమె ఫోటో అతికించి, సంతకం ఫోర్జరీ చేసి  మరికొందరికి ఈ భూమిని బదలాయించిన వ్యవహారం వివాదస్పదంగా మారింది. ఈ సేల్ డీడ్ ప్రక్రియను ధరణి పోర్టల్ లో ఎంట్రీ చేసే క్రమంలో అమ్మిన, కొనుగోలు చేసిన వారి వివరాలతోపాటు, సాక్ష్యుల గురించి పూర్తిగా విచారించకుండానే రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో తహసీల్దార్ తిరుమల్ రావు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలడంతో ఆయనను సస్పెండ్ చేశారు. 

నాటి అధికార పార్టీ నేత అండతో.. 

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఓ నాయకుడి బంధువైన జమ్మికుంట తహసీల్దార్ రజినీపై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. హనుమకొండ జిల్లా శాయంపేట తహసీల్దార్ గా పని చేసే క్రమంలో ఆమె వేధింపులు భరించలేక ఓ రెవెన్యూ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రచారం జరిగింది.

ధర్మసాగర్ తహసీల్దార్ గా పని చేసిన సమయంలోనూ పాస్ బుక్ ల జారీలో లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. తాజాగా ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఆమె ఇంట్లో గుర్తించిన ఆస్తుల విలువ అధికారికంగా రూ.3.20 కోట్లపై మాటే కాగా..  ఇవే ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్ లో  రూ.20 కోట్లపైమాటేనని తెలిసింది.   

ధరణి వచ్చినా లంచాలు ఆగలే.. 

ధరణి పోర్టల్ వచ్చాక అందులో నమోదై ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్లాట్ బుక్ చేసుకుని వెళ్తే... తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. అమ్మకందారు, కొనుగోలుదారు ఎలాంటి డబ్బులు ముట్టజెప్పాల్సిన పని లేదు. అయినప్పటికీ ప్రతి రిజిస్ట్రేషన్ కు రూ.10 వేల నుంచి రూ.15 వేలు వసూలు చేస్తున్నారు. గుంట, రెండు గుంటల చొప్పున ఫామ్ ల్యాండ్స్  పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న మండలాల్లో ఈ దందా ఎక్కువగా నడుస్తోంది.