- నిబంధనలకు విరుద్ధంగా రికార్డుల మార్పిడి.. అక్రమ మ్యుటేషన్లు
- సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్‌కు హెరిటేజ్ డైరెక్టర్ లేఖ
హైదరాబాద్, వెలుగు: చారిత్రక ప్రాధాన్యం ఉన్న పురావస్తు భూములు కబ్జాకోరుల పాలవుతున్నాయి. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బాలానగర్ మండలం హస్మత్‌పేటలోని అత్యంత విలువైన ‘మెగాలిథిక్ బరియల్ సైట్’ (బృహత్ శిలా యుగం నాటి సమాధులు) భూములను కొందరు వ్యక్తులు, సొసైటీలు అక్రమంగా తమ పేరిట మార్చుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై పురావస్తు, వారసత్వశాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాడి స్పందించారు. ఈ అక్రమ మ్యుటేషన్లపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూమిని కాపాడాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు.
గెజిట్ రికార్డుల్లో ఉన్నా బేఖాతరు..
హస్మత్‌పేట సర్వే నంబర్ 1లో మొత్తం 108.12 ఎకరాల భూమి ఉండగా.. అందులో 30.07 ఎకరాలు పురావస్తుశాఖకు చెందిన రక్షిత కట్టడంగా 1953 నాటి గెజిట్‌లోనే నమోదైంది. చట్ట ప్రకారం ఈ భూమిలో ఎలాంటి క్రయవిక్రయాలు, ఆక్రమణలు చేయకూడదు. కానీ పురావస్తుశాఖకు కనీసం సమాచారం లేకుండా కొన్ని హౌసింగ్ సొసైటీలకు అనుకూలంగా సుమారు 64 ఎకరాల భూమిని రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ చేశారు. గతంలో జాయింట్ కలెక్టర్ ఈ మ్యుటేషన్లను రద్దు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో రికార్డులు మాత్రం పూర్వస్థితికి రాలేదు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం ఈ వివాదం స్పెషల్ ట్రిబ్యునల్‌లో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆక్రమణలు జరుగుతుండటంపై శాఖాపరంగా ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ వారసత్వ సంపదను కాపాడటంలో రెవెన్యూ యంత్రాంగం చొరవ చూపాలని కోరారు. ‘సర్వే నంబర్ 1లోని భూమి మ్యుటేషన్లు, బదలాయింపులపై తక్షణమే పూర్తిస్థాయి విచారణ చేపట్టాలి. అక్రమంగా మార్చిన రెవెన్యూ రికార్డులను రద్దు చేసి, పురావస్తు శాఖ పేరును పునరుద్ధరించాలి. వారసత్వ భూమిని సర్వే చేసి, వెంటనే ఫెన్సింగ్ వేయడం ద్వారా సరిహద్దులను ఖరారు చేయాలి. ఈ వివాదం పరిష్కారమయ్యే వరకు ఆ భూములకు సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరగకుండా నిరోధించాలి. చారిత్రక ఆనవాళ్లను భావితరాలకు అందించేందుకు ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని, తక్షణమే ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకోవాలి’ అని డైరెక్టర్ తన లేఖలో స్పష్టం చేశారు.
