బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు

బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు
  • కేసీఆర్కు ఎకరాకు కోటి ఆదాయం వస్తుంటే.. మిగతా రైతులకు ఎందుకు రావట్లే
  • కేసీఆర్ సమాధానం చెప్పాలి
  • మెడికల్ కాలేజి పేరుతో భూ దందా కు తెరలేపారు
  • దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

మహబూబాబాద్ జిల్లా: టీఆర్ఎస్ నేతల భూకబ్జాలు, హత్యా రాజకీయాలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రకటించారు. మెడికల్ కాలేజి పేరుతో భూ దందా కు తెరలేపారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ వ్యవసాయం చేస్తే ఎకరాకు కోటి రూపాయల ఆదాయం వస్తుంటే.. రాష్ట్రంలోని మిగతా రైతులకు ఎందుకు రావట్లేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తున్న, నిలదీస్తున్న బీజేపీని తిట్టడమే టీఆర్ఎస్ నేతలు పనిగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. 

సోమవారం మహబూబాబాద్ పట్టణంలోని యశోద గార్డెన్ లో  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  8 ఏళ్ల  ప్రజా సంక్షేమ పాలన సదస్సుకు ఎమ్మెల్యే రఘునందన్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్,  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజవర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాంచందర్ రావు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ రాష్టం ఏర్పడి 8ఏండ్లు అయినా గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ అమలు చేయలేదన్నారు. తండాలు గ్రామ పంచాయతీలు అయ్యాయి కానీ అభివృద్ధి మాత్రం జరగలేదన్నారు. దేవాలయాల నుండి వచ్చే ఆదాయాలను మజీదుల అభివృద్ధికి ఉపయోగిస్తున్నారని, తండాలో ఒక్క సేవాలాల్ గుడి కూడా కట్టలేదన్నారు. మహిళల ఆత్మగౌరవం కోసం ఇంటింటికి మరుగుదొడ్డి, ఉజ్వల పధకం ద్వారా ఉచితంగా  సిలిండర్ ఇచ్చిన ఘనత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదని రఘునందన్ రావు వివరించారు. కాంగ్రెస్ హయాంలో ఒక ఎల్ఇడి బుల్బు ధర 600 రూపాయలు, ప్రధాని నరేంద్రమోడీ హయాంలో దాని ధర 70 రూపాయలు అయిందన్నారు. దేశంలో అత్యధికంగా జాతీయ రహదారులను నిర్మించిన ఘనత మోడీ ప్రభుత్వానిదని పేర్కొన్నారు.
ఒక్కరోజు కూడా సెలవు పెట్టని నాయకుడు మోడీ
ప్రధాని బాధ్యతలు చేపట్టాక 8 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు సెలవు పెట్టని నాయకుడు ప్రధాని నరేంద్రమోడీ అని ఎమ్మెల్యే రఘునందన్ రావు కొనియాడారు. పోడు భూములకు పట్టాలివ్వకుండా గిరిజన ఆదివాసీలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. మానుకోటలో భూ కబ్జాలు  హత్యలపై అసెంబ్లీ లో ప్రస్తావిస్తానన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్టులు, హత్యరాజకీయలు చేస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. గిరిజనులకు ఆదివాసీలకు కేంద్రంలో సముచిత స్థానం ఇచ్చిన ఘనత మోడీ ప్రభుత్వానిదని, భాజపా అధికారంలోకి రాగానే పొడుభూములకు పట్టాలిస్తామన్నారు. డబుల్ బెడ్ రూమ్ పేరుతో డబ్బులు వసూలు చేసే వారిని తరిమికొట్టాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు సూచించారు.