భూములు, ఇండ్లు, ఫ్లాట్లు అంతా డిజిటల్..

భూములు, ఇండ్లు, ఫ్లాట్లు అంతా డిజిటల్..
  • అసెంబ్లీలో రెవెన్యూ బిల్లు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌
  • జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా ఎమ్మార్వోలు
  • వ్యవసాయ భూమి రి జిస్ట్రేషన్ల అధికారం వారికే
  • ఇతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ కు పాత పద్ధతే
  • ‘ధరణి’లో భూముల వివరాలు చూసేందుకు చాన్స్
  • పాసు బుక్కుల్లోకి ఫ్యామిలీ మెంబర్ల పేర్లు కూడా
  • రెవెన్యూ కోర్టుల రద్దు.. వివాదాలుంటే సివిల్​ కోర్టుకే

రాష్ట్రంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్​ వ్యవహారాలన్నింటినీ పూర్తిగా డిజిటల్​వ్యవస్థలోకి తీసుకొస్తున్నామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. ఇండ్లు, భూములు, ఆఫీసులు వంటి స్థిరాస్తుల వివరాలన్నింటినీ ఆన్‌‌ లైన్‌‌లోకి ఎక్కిస్తామని.. భూముల సర్వే చేపట్టి స్టేట్ డిజిటల్ మ్యాప్ రూపొందిస్తామని తెలిపారు. ఈ మ్యాప్‌‌, ఆస్తులు, వాటి ఓనర్ల వివరాలన్నింటితో ‘ధరణి’ పేరిట పోర్టల్ తెస్తున్నామని.. ఎవరైనా ఆ పోర్టల్​లో వివరాలను చూడొచ్చని చెప్పారు. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్‌‌, అప్​డేషన్​ ప్రక్రియ కూడా ఆ పోర్టల్‌‌లోని డేటా ఆధారంగానే చేస్తామన్నారు. వీఆర్వోల వ్యవస్థ రద్దు, కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లులను సీఎం కేసీఆర్​ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మూడేండ్ల పాటు కష్టపడి కొత్త చట్టం రూపొందించామని చెప్పారు. రెవెన్యూ డిపార్ట్​మెంట్  అవినీతి వల్ల తరతరాలుగా జనం అనుభవిస్తున్న బాధలను కొత్త చట్టం తీరుస్తుందన్నారు. రాష్ట్రంలో భూముల ధరలు పెరిగాయని, భవిష్యత్‌‌లో ఇంకా పెరుగుతాయని.. దీనితో వివాదాలు పెరిగే చాన్స్​ ఉందని సీఎం అన్నారు. అవన్నీ ఆలోచించే పకడ్బందీగా కొత్త చట్టం తెస్తున్నామన్నారు.

ధరణి పోర్టల్‌‌ ఫర్ ఆల్

ప్రభుత్వం తీసుకొచ్చే ధరణి పోర్టల్‌‌  రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్లు, ఆస్తుల వివరాలకు కేరాఫ్‌‌గా ఉంటుందని సీఎం కేసీఆర్​ తెలిపారు. నాన్‌‌ అగ్రికల్చర్, అగ్రికల్చర్‌‌‌‌ పేరిట రెండు విభాగాలుగా పోర్టల్​ ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో 2 కోట్ల 75 లక్షల ఎకరాల భూమి ఉందని, అందులో కోటీ 60 లక్షలదాకా అగ్రికల్చర్ ల్యాండ్‌‌ ఉందని వివరించారు. 66 లక్షల 56 వేల ఎకరాల అటవీ భూమి ఉందని.. మిగిలిందంతా నివాస ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలు, కంపెనీలు, రోడ్లు, రైల్వే లైన్లు, స్కూళ్లు, కాలేజీలు ఇలా రకరకాలు ఉందని తెలిపారు. ఈ వివరాలన్నింటినీ కూడా పోర్టల్‌‌లో అప్‌‌లోడ్ చేస్తామన్నారు. ఎవరైనా పోర్టల్‌‌లోకి ఎంటరై భూములు, ఇండ్లు, ఆస్తులు ఎవరి పేరిట ఉన్నాయో చూడొచ్చని కేసీఆర్​ చెప్పారు. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈసీ సర్టిఫికెట్ సహా అన్నింటినీ పోర్టల్‌‌లో అందుబాటులో ఉంచుతామని, ఎవరైనా డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ పోర్టల్ సర్వర్లను రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పెడ్తామన్నారు. గతంలో చార్మినార్‌‌  వంటి చారిత్రక స్థలాలను, రైల్వేస్టేషన్లను కూడా రిజిస్ట్రేషన్ చేసేవాళ్లని, ఇకపై ఇలాంటివి ఉండవని అన్నారు. అసైన్డ్‌‌ భూములు, ప్రభుత్వ స్థలాలు వంటి అన్నింటినీ పోర్టల్‌‌లో లాక్ చేసేస్తామన్నారు.

రెవెన్యూ కోర్టులు రద్దు

ఎమ్మార్వో, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో నడిచే రెవెన్యూ కోర్టులను రద్దు చేస్తున్నామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. అధికారులే ఆర్డర్లు ఇచ్చి, అధికారులే కోర్టులు నడిపించే విధానం సరికాదన్నారు. రెవెన్యూ కోర్టుల్లో ప్రస్తుతం 16,137 కేసులు పెండింగ్​లో ఉన్నాయని వెల్లడించారు. అందులో 12 వేలకుపైగా ఆర్వోఆర్‌‌ కేసులు‌‌, 1,138 ఇమామ్ అబాలిషన్‌‌ కేసులు, 316 ఎన్‌‌ఎంసీ, 12 భూదాన్‌‌, 728 పీవోటీ, 30 భూ ఆక్రమణ, 136 ల్యాండ్ ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌ రెగ్యులరైజేషన్‌‌, 1,165 ఇతర కేసులు ఉన్నాయని చెప్పారు. ప్రతి వెయ్యి కేసులకు ఒక ట్రిబ్యునల్ (ఫాస్ట్ ట్రాక్‌‌ కోర్టు) ఏర్పాటు చేసి పరిష్కరిస్తామన్నారు. దీనిపై హైకోర్టు సలహాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇకపై భూవివాదాలు ఏవైనా ఉంటే సివిల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడికైనా
వెళ్లొచ్చన్నారు.

వ్యవసాయేతర ఆస్తులన్నీ సబ్​రిజిస్ట్రార్ల పరిధిలో..

నాన్ అగ్రికల్చర్ భూములు, ఆస్తులు, ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు వంటి అన్నిరకాల వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్​ పవర్​ సబ్ రిజిస్ట్రార్లకు ఉంటుందని సీఎం తెలిపారు. వెంటనే మ్యుటేషన్‌‌, ఆన్‌‌లైన్‌‌ అప్‌‌డేషన్ కూడా చేస్తారన్నారు. ప్రస్తుతం గ్రామ కంఠంలో 44.28 లక్షల ఆస్తులు, మున్సిపాలిటీల్లో 20.29 లక్షల ఆస్తులు, జీహెచ్‌‌ఎంసీలో 24.90 లక్షల ఆస్తులు మ్యుటేషన్ అయి ఉన్నాయని చెప్పారు. వాటన్నింటినీ ధరణి పోర్టల్‌‌లో అప్‌‌లోడ్ చేస్తామని.. అది పూర్తయ్యాక ఏ ఇళ్లు ఎవరిదో, ఏ ప్లాట్ ఎవరిదో పోర్టల్‌‌లో చూడొచ్చన్నారు.

పాస్‌‌ బుక్‌‌లో ఫ్యామిలీ మెంబర్ల వివరాలు కూడా..

వారసత్వ భూమి రిజిస్ట్రేషన్లు చేయకుండా ఆఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారంటూ చాలా ఫిర్యాదులు వస్తున్నాయని సీఎం కేసీఆర్​ చెప్పారు. ఇకపై ఈ తిప్పలు ఉండబోవని.. వారసులు ఎవరో నిర్ణయించుకునే హక్కు కుటుంబ సభ్యులకే ఇస్తామని తెలిపారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చాక.. భూములు ఉన్నోళ్లంతా ఫ్యామిలీ మెంబర్ల వివరాలు ఇస్తే, ఆన్‌‌లైన్‌‌లో ఎంటర్ చేస్తామని.. పట్టాదారు పాస్‌‌ బుక్‌‌లోనూ పొందు పరుస్తామని వెల్లడించారు. వారసత్వ రిజిస్ట్రేషన్  చేయించుకోవాల్సి వచ్చినప్పుడు.. పాస్​బుక్‌‌లో రిజిస్టరై ఉన్న వాళ్లంతా సంతకాలు పెట్టి, రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

లైఫ్‌ టైమ్ క్యాస్ట్ సర్టిఫికెట్‌

ఇకపై ఒకసారి క్యాస్ట్​ సర్టిఫికెట్ ఇస్తే.. అదే లైఫ్ టైమ్ ఉంటుందని, మళ్లీ మళ్లీ తీసుకోవాల్సిన అవసరం లేదని సీఎం చెప్పారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకే క్యాస్ట్​ సర్టిఫికెట్లు ఇచ్చే పవర్స్​ ఇస్తామని.. రెవెన్యూ డిపార్ట్​మెంట్​కు ఈ అధికారం ఉండబోదని తెలిపారు. ఇన్‌కం సర్టిఫికెట్లు కూడా ఆన్‌లైన్ డేటా బేస్ ఆధారంగా ఇవ్వనున్నట్టు సీఎం వెల్లడించారు. ఎవరెవరు ఏ ఉద్యోగాలు చేస్తున్నరు, వాళ్ల ఆదాయం ఎంతనో ఇప్పటికే ప్రభుత్వం వద్ద వివరాలు ఉన్నాయని.. దాన్ని మరింత డెవలప్ చేసి, ఆ డేటా ఆధారంగా ఇన్‌కం సర్టిఫికెట్లు ఇస్తామని తెలిపారు.

అరగంటలో కంప్లీట్

తహసీల్దార్లకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా అధికారాలు కల్పిస్తున్నాం.  వీళ్లకు వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్‌ చేసే అధికారం మాత్రమే ఉంటుంది… రిజిస్ట్రేషన్‌ తోపాటు మ్యుటేషన్‌ కూడా వారి వద్దే జరుగుతుంది. రిజిస్ట్రేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో రిక్వెస్ట్‌ పెట్టుకుంటే. ఎమ్మార్వో వారికి టైమ్ కేటాయిస్తారు. భూమి అమ్మేవాళ్లు పాసుబుక్‌ పట్టుకుని వెళ్లాలి.. వివరాలను ఆన్‌లైన్‌లో చెక్ చేసి, చార్జీలు తీసుకుని వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ భూమి వివరాలు అమ్మినవాళ్ల పాస్ బుక్‌ నుంచి వెంటనే డిలీట్‌ అయి, కొన్నవారి పేరు మీదకు యాడ్​ అవుతాయి. వెంటనే అక్కడే మ్యుటేషన్ కూడా చేసేస్తారు. ఆ టైమ్‌తో సహా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. లాగ్‌ బుక్‌లోనూ ఎంటర్ చేస్తారు. రిజిస్ట్రేషన్‌ పేపర్లు, పాస్‌బుక్‌, ధరణి కాపీ కూడా అప్పుడే ఇస్తారు. ఇదంతా కూడా
అరగంటలో అయిపోతుంది.

ఆఫీసుల్లో ఐటీ టేబుల్స్

ఇకపై ప్రతి ఎమ్మార్వో, రిజిస్ట్రార్​ ఆఫీసులో ఐటీ టేబుల్ ఉంటుందని సీఎం కేసీఆర్​ చెప్పారు. భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ అయిన వెంటనే.. అక్కడే వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారని తెలిపారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పాస్‌బుక్, ధరణి కాపీ కూడా వెంటనే ఇస్తారన్నారు. ఆ మరుక్షణమే ఆన్‌ లైన్‌లో ఆ భూమి ఎవరి పేరు మీదకు మారిందో చూడొచ్చని.. ఈ ప్రాసెస్​ అంతా అరగంట నుంచి గంట లోపలే పూర్తవుతుందని వివరించారు.

ఇంచ్‌‌ టు ఇంచ్‌‌ సర్వే

రాష్ట్రంలోని మొత్తం భూమిని ఇంచ్ టు ఇంచ్ సర్వే చేయించి, ‘డిజిటల్ మ్యాప్​ ఆఫ్  తెలంగాణ’ రూపొందిస్తామని సీఎం తెలిపారు. ప్రతి సర్వే నంబర్‌‌‌‌కు కోఆర్డినేట్స్‌‌ (లాంగిట్యూట్స్‌‌, లాటిట్యూడ్స్‌‌) చేయిస్తామని.. భూగోళం ఉన్నంత వరకూ అవి అలాగే ఉంటాయని పేర్కొన్నారు. వాటిని మార్చే అధికారం, ట్యాంపర్  చేసే చాన్స్​ఎవరికీ ఉండదన్నారు. భూముల రిజిస్ట్రేషన్‌‌లో అధికారులకు విచక్షణ అధికారాలు కూడా ఉండవని, చట్టానికి లోబడే పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు.