
పర్మిషన్ లేకుండా ప్రభుత్వ భూములు, చెరువుల్లో తవ్వకాలు
టిప్పర్లు, ట్రాక్టర్లలో వెంచర్లు, కంపెనీలకు తరలింపు
అడ్డుకున్న స్థానికులపై దాడులకు దిగుతున్న మాఫియా
ప్రభుత్వ ఆదాయానికి గండి.. పట్టించుకోని ఆఫీసర్లు
మెదక్ (మనోహరాబాద్, శివ్వంపేట), వెలుగు : మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలతో ఎలాంటి పర్మిషన్ లేకుండానే ప్రభుత్వ, అసైన్డ్ భూముల నుంచి జేసీబీలతో మట్టిని తవ్వి, టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా వెంచర్లు, ఫామ్ హౌస్‌లకు తరలిస్తున్నారు. స్థానికుల అడ్డుకుంటే దాడులకు దిగుతున్నారు. కొన్నిచోట్ల కట్టెలతో కాపాలా ఉంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు, పోలీసులు తమకే సంబంధం లేన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఎక్కడైనా ప్రజలు టిప్పర్లు, ట్రాక్టర్లను అడ్డుకొని ఫిర్యాదు చేస్తే ఫైన్‌తో సరిపెడుతున్నారు. తెల్లారితే షరామామూలే అయిపోతోంది. మామూళ్లకు అలవాటు పడడంతోనే లైట్ తీసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మనోహరాబాద్‌లో విచ్చలవిడిగా...
కంపెనీలు ఎక్కువగా ఉన్న మనోహరాబాద్మండలంలో మట్టి దందా విచ్చలవిడిగా సాగుతోంది. ప్రభుత్వ భూములతో పాటు చెరువులు, కుంటల నుంచి నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్నారు. కొన్ని చోట్ల రైతులకు ఎంతో కొంత ఇచ్చి అసైన్డ్ భూముల్లో కూడా మట్టిని తవ్వుతున్నారు. కొండాపూర్‌కు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు రంగాయిపల్లి గ్రామ శివారులో మట్టిని తవ్వి టిప్పర్‌కు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు పారిశ్రామిక వాడకు అమ్ముకుంటున్నారు. టిప్పర్లను తరలించేందుకు వీలుగా రంగాయిపల్లి అటవీ ప్రాంతంలో మట్టి రోడ్డు వేయడం గమనార్హం. ప్రస్తుతం మట్టి తవ్వుతున్న ప్రాంతంలో గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. ఇదే మండలంలోని పాలాట గ్రామానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి కుచారం గ్రామం శివారులో నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నాడు. ఈ నెల 9న రంగాయిపల్లి వార్డ్ మెంబర్ పెద్దబాల శ్రీను టిప్పర్‌ను అడ్డుకోగా... అతడిపై దాడి చేసి గాయపరిచారు.
వెంచర్లు, ఫామ్ హౌస్‌లకు...
శివ్వంపేట మండలం దంతాన్ పల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూముల్లో నుంచి హిటాచీలతో మట్టి తవ్వి టిప్పర్లలో వెంచర్లకు తరలిస్తున్నారు. నాగులపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు టిప్పర్‌కు రూ.5 నుంచి రూ.6 వేల వరకు వసూలు చేసి మట్టిని హైదరాబాద్‌కు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. సికింద్లాపూర్ గ్రామ శివారులో నుంచి దేవాదాయ, ప్రభుత్వ భూములు, చెరువులో నుంచి వందల ట్రిప్పుల మట్టిని వెంచర్లకు, ఫామ్ హౌస్ లకు, కంపెనీలకు తరలిస్తున్నారు. నవాపేట్ ప్రభుత్వ భూముల్లో నుంచి కొత్తగా ఏర్పాటు చేస్తున్న కంపెనీలకు రాత్రి వేళల్లో అక్రమంగా మట్టి తరలిపోతోంది. ఎవరైనా అడ్డువస్తే దాడి చేసేందుకు కిరాయి వ్యక్తులను కట్టెలతో కాపలాగా ఉంచుతున్నారు . గ్రామ శివారులో ఉన్నలో తాన్ చెరువులో నుంచి రెండు రోజులుగా మట్టిని భోజ్య తండా గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న సీడ్ కంపెనీకి మట్టిని తరలిస్తున్నారు. రెవెన్యూ అధికారులకు చెప్పినా.. పట్టించుకోకపోవడంతో సర్పంచ్ రాజు నాయక్, తండావాసులు ట్రాక్టర్లను అడ్డుకొని ఇరిగేషన్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. కాగా, ‘ట్రాక్టర్ ఫొటోలు తీసి పంపండి చూస్తాం’ అని ఇరిగేషన్ అధికారులకు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, వారిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు సర్పంచ్ రాజు నాయక్ తెలిపారు.
నిఘా పెడతాం
అక్రమంగా మట్టి తరలిస్తున్నట్టు మా దృష్టికి రాలేదు. అలాంటిదేమన్నా జరిగితే ప్రత్యేక నిఘా పెడతాం. అక్రమంగా మట్టి తరలించే వెహికిల్ ఓనర్, డ్రైవర్ లపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. మట్టి తరలింపునకు మేము ఎవరికీ ఫర్మిషన్ ఇవ్వలేదు.
- శ్రీనివాస్ చారి, శివ్వంపేట తహసీల్దార్