కంటోన్మెంట్​ భూముల సర్వే పూర్తి

కంటోన్మెంట్​ భూముల సర్వే పూర్తి
  • త్వరలో డిఫెన్స్ మినిస్ట్రీకి సర్వే నివేదిక

కంటోన్మెంట్, వెలుగు: సికింద్రాబాద్ ​కంటోన్మెంట్​ బోర్డు పరిధిలోని అన్ని రకాల భూములపై నిర్వహిస్తున్న ల్యాండ్​ మ్యాపింగ్​సర్వే పూర్తయింది. నెలరోజుల పాటు కొనసాగిన సర్వే రిపోర్టును బోర్డు అధికారులు త్వరలో డిఫెన్స్​ మినిస్ట్రీకి పంపనున్నారు. తర్వాత బోర్డు పరిధిలోని భూములపై హక్కులు కలిగి ఉన్నవారికి లీగల్ ఓనర్​షిప్​ కార్డులు అందజేయనున్నారు. స్వామిత్వ పథకం కింద ఈ సర్వే నిర్వహించగా మొత్తం 40.17 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 32 చదరపు కిలో మీటర్ల మేర స్థలాలు ఆర్మీ, రక్షణ శాఖ ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు. మిగతావి ప్రైవేటు ప్లాట్లు, బస్తీలు, కాలనీలు, కంటోన్మెంట్​కు సంబంధించినవని తేల్చారు. అయితే బోర్డు పరిధిలోని చాలా కాలనీలు, బస్తీల్లో ఉంటున్నవారికి లీగల్ సర్టిఫికెట్లు లేవు. ఇలాంటి వారందరికీ వారి ఆస్తి విలువ, ఇంటి విలువను బట్టి త్వరలో లీగల్ గా హక్కులు కల్పించనున్నారు.

వివిధ కారణాలతో ఆలస్యం

కంటోన్మెంట్ ​బోర్డు పరిధిలోని భూములకు సంబంధించి జూన్ ఒకటో తేదీ నుంచి సర్వే నిర్వహించాలని అధికారులు తీర్మానించగా, ఈ ప్రాంతమంతా రక్షణ వలయంలో ఉండటం, తరచూ ప్రముఖుల రాకపోకలు, వరుస వానలు, డిఫెన్స్​ మినిస్ట్రీ నుంచి అనుమతుల పెండింగ్ ఇలా వివిధ కారణాలతో ఆలస్యం అయ్యింది. జూలై 25న డ్రోన్స్ సహాయంతో సర్వే మొదలుపెట్టగా ఆగస్టు 25న పూర్తిచేశారు. ల్యాండ్​మ్యాపింగ్ తో బోర్డు పరిధిలోని స్థలాలు కబ్జా కాకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.

అలాగే ఇప్పటికే బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు డిఫెన్స్ మినిస్ట్రీ ఓకే చెప్పింది. ఈ సర్వేతో బోర్డు పరిధిలోని భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించడంతోపాటు విలీన ప్రక్రియ మరింత ఈజీ కానుందంటున్నారు. దేశంలో మొట్ట మొదటిసారి ల్యాండ్ మ్యాపింగ్ కోసం ఇక్కడ డ్రోన్లు వాడడం విశేషం.