
- హుస్నాబాద్ ఆర్డీవో ఆఫీసు ముందు ఆమరణ దీక్ష
- ధరణినితో లీడర్లు భూములను కాజేశారని ఆరోపణ
- పట్టాలు రద్దు చేస్తామని తహసీల్దార్ హామీ దీక్ష విరమణ
హుస్నాబాద్, వెలుగు: ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకొని కొందరు తమ భూములను కాజేశారని, వాటిని తిరిగి ఇప్పించకపోతే చావే శరణ్యమని బాధితులు వాపోయారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్), వంగరామయ్యపల్లిలోని తమ భూములను అక్రమంగా పట్టా చేయించుకున్నారని, కబ్జాదారుల నుంచి తమ భూములను ఇప్పించాలని బాధితులు కాలేజ్ రాజేశ్, కాలేజ్ శివ, కాలేజ్ రాజ్‌కుమార్, వేముగంటి రవి, వేముగంటి వెంకటేశ్ సోమవారం హుస్నాబాద్‌లోని ఐవోసీ బిల్డింగ్ ముందు ఆమరణ నిరాహారదీక్షకు దిగారు.
తమ తాతలు, తండ్రులు డెబ్బైఏండ్ల కింద పోతారం(ఎస్), వంగరామయ్యపల్లి శివారులోని గడ్డల కింద 9 ఎకరాలను కొని ఇండ్లు కట్టుకున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో ఆ భూములను మాజీ ఎంపీటీసీ బొమ్మగాని హరిబాబు, వ్యవసాయ మార్కెట్మాజీ డైరెక్టర్పంజా సంపత్, భూక్య తిరుపతి, బోడ రవి, కంసాని మల్లారెడ్డి తమకు తెలియకుండా అక్రమంగా పట్టా చేయించుకున్నారన్నారు.
సర్వే నంబర్లు 250, 263లో నాలుగు ఎకరాల భూమిని పట్టా చేయించుకొని రెండేండ్లుగా రైతుబంధు, పీఎం కిసాన్ కింద వచ్చే సాయాన్ని పొందుతున్నారన్నారు. కొద్ది రోజుల నుంచి సదరు వ్యక్తులు తమ వద్దకు వచ్చి ఇండ్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదన్నారు. తమ భూములను అక్రమంగా పట్టా చేయించుకున్నవారిపై చర్యలు తీసుకొని, తమ భూములను తిరిగి తమ పేరున పట్టా చేయించాలని డిమాండ్ చేశారు. లేకుంటే అన్నం, నీళ్లు ముట్టుకునేది లేదన్నారు.
ఎస్సై మహేశ్ అక్కడికి వచ్చి వారి సమస్య తెలుసుకున్నారు. విషయాన్ని తహసీల్దార్ రవీందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వచ్చారు. ఇప్పటికే విచారణ జరిపామని, ఎవరైతే బాధితుల భూములను పట్టా చేసుకున్నారో, వారి పట్టాలను రద్దుచేస్తామని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించారు.