
- పట్టణ శివారులో 24 ఎకరాల అసైన్డ్ భూమి గుర్తింపు
- జేసీబీ, డోజర్లతో చకచకా చదును
మెదక్, వెలుగు: ఆదాయం సమకూర్చుకునేందుకు హైదరాబాద్ చుట్టుపక్కల, ఔటర్‌రింగ్ రోడ్డు, కొత్తగా నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్డు సమీపంలో అసైన్డ్ భూములు సేకరించి ప్లాట్లు విక్రయించేందుకు ల్యాండ్ పూలింగ్ స్కీం అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాన్ని జిల్లాలకూ విస్తరిస్తోంది. మున్సిపల్ పరిధిలో ల్యాండ్ పూలింగ్ కింద అసైన్డ్ భూములు సేకరించి ప్లాట్లు చేసి అమ్మేందుకు ప్లాన్ చేస్తోంది. దీని కోసం ఒక్కో మున్సిపాలిటీ పరిధిలో 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో లే అవుట్ చేయాలని నిర్ణయించింది.
మెదక్ జిల్లాలో ఇంతకు ముందు ప్రతిపాదించిన రీజినల్ రింగ్ రోడ్డు వెళ్లే తూప్రాన్ మండలంలోని వివిధ గ్రామాల పరిధిలో ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా అసైన్డ్ భూముల సేకరణ ప్రక్రియ మొదలు పెట్టింది. శివ్వంపేట మండలంలోనూ పలు గ్రామాల పరిధిలో భూముల సర్వే చేసింది. ఇప్పుడు జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణ శివారులో ల్యాండ్ పూలింగ్స్కీం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ ఆఫీసర్లు మెదక్–చేగుంట మెయిన్ రోడ్డు వెంట ఎంసీహెచ్ హాస్పిటల్ కు వెళ్లే దారికి ఎదురుగా ఉన్న 14 మంది రైతులకు చెందిన 24 ఎకరాల అసైన్డ్ భూమిని సేకరించేందుకు రంగం సిద్ధం చేసింది. సర్వే కూడా పూర్తి చేసిన అధికారులు, ప్రస్తుతం ల్యాండ్ లెవలింగ్ పనులు చేయిస్తున్నారు.
జేసీబీలు, డోజర్లతో వర్క్స్ ముమ్మరంగా సాగుతున్నాయి. అక్కడ రోడ్లు వేసి, మౌలిక వసతులు కల్పించి, మొత్తం భూమిలో స్కూల్, పార్క్, టెంపుల్ వంటి సామాజిక అవసరాల కోసం 10 శాతం స్థలాన్ని కేటాయించి, ప్లాట్లు విక్రయించనున్నారు. కాగా, ల్యాండ్ పూలింగ్ కింద సేకరించిన భూమిలో గతంలో పట్టా పొందిన అసైనీలకు డెవలప్ చేసిన వెంచర్ లో ఎకరాకు 500 నుండి 600 గజాల స్థలం చొప్పున ఇవ్వనున్నట్టు తెలిసింది.