
- ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఇతరులకు రిజిస్ర్టేషన్
- కీ రోల్ పోషిస్తున్న కొందరు ఔట్సోర్సింగ్ఎంప్లాయిస్
- ఆఫీసర్లు, కొందరు లీడర్ల హస్తమున్నట్లు ఆరోపణలు
ఈయన పేరు మహ్మద్ జావెద్. ఊరు జడ్చర్ల. 2013లో మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 46/1/ఏలో ఉన్న 2.01 ఎకరాల భూమిని మాధవి అనే మహిళ నుంచి కొన్నడు. అయితే, 2018లో భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత ఈయనకు డిజిటల్పాస్ బుక్‌ను జారీ చేయలేదు. ఆఫీసర్లను ప్రశ్నిస్తే ఆధార్ అప్డేట్కాలేదని సమాధానం చెప్పిన్రు. ధరణి వచ్చాక కూడా డీఎస్‌లో పెండింగ్‌లో పెట్టినరు. ఈ విషయాన్ని తెలుసుకున్న పాలమూరు పట్టణానికి చెందిన వ్యక్తి ఫేక్ఆధార్కార్డు, డాక్యుమెంట్లు సృష్టించి ఇతరులకు అమ్మే ప్రయత్నం చేసిండు. విషయం తెలుసుకున్న అసలు రైతు తహసీల్దార్ ఆఫీస్‌కు చేరుకొని రిజిస్ర్టేషన్ కాకుండా అడ్డుకున్నడు.
మహబూబ్‌నగర్, వెలుగు: రెవెన్యూ ఆఫీసులు అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ర్టేషన్ల బాధ్యతను ప్రభుత్వం తహసీల్దార్లకు అప్పగించినా.. ధరణి పోర్టల్ తీసుకొచ్చినా అవినీతి ఆగడం లేదు. ధరణిలోని లొసుగులను ఆధారంగా చేసుకొని అక్రమంగా రిజిస్ర్టేషన్లు చేస్తున్నారు. ముఖ్యంగా డిజిటల్ సంతకాలు పెండింగ్‌లో ఉన్న భూముల వివరాలను ఐడెంటిఫై చేసి ఫేక్ డాక్యుమెంట్లతో ఇతరులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు కొందరు ఔట్సోర్సింగ్ఉద్యోగులు, కొందరు ధరణి ఆపరేటర్లు కీ రోల్ పోషిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో డిజిటల్ సిగ్నేచర్లకు సంబంధించి 7,991 ఆన్లైన్ అప్లికేషన్లు రాగా... 7,955 అప్లికేషన్లను క్లియర్ చేసినట్లు కలెక్టేట్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఇంకా 36 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.
పెండింగ్ డీఎస్‌లను ఆసరాగా చేసుకోని..
మహబూబ్‌నగర్ జిల్లాలో 16 మండలాలు ఉండగా.. అన్ని తహసీల్దార్ ఆఫీసుల్లో అగ్రికల్చర్ల్యాండ్రిజిస్ర్టేషన్లు జరుగుతున్నాయి. భూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభించినప్పటి నుంచే ప్రతి మండల పరిధిలో వేలల్లో డిజిటల్ సిగ్నిచర్లు పెండింగ్‌లో ఉన్నాయి. ధరణి వచ్చాక కూడా ఇలాగే కొనసాగుతున్నాయి. వీటిని ఆసరాగా తీసుకొని కొందరు వ్యక్తులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ ఆఫీసుల్లో గతంలో పని చేసి మానేసిన కొందరు ఆపరేటర్లతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న ఆపరేటర్లు, సిబ్బందితో గ్యాంగ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం రెండు నెలల క్రితం డీఎస్ ఆప్షన్అందుబాటులోకి తేవడంతో పెండింగ్‌లో ఉన్న భూములను టార్గెట్ చేస్తున్నారు. ఆపరేట్ల ద్వారా వాటి వివరాలు తెలుసుకొని ఫేక్ ఆధార్ కార్డులు, డాక్యుమెంట్లను క్రియేట్ చేస్తున్నారు. పేర్లను అలాగే ఉంచి, అసలు పట్టాదారు అయిన రైతు తండ్రి పేరు, అడ్రస్‌ను ఎంట్రీ చేస్తున్నారు. డాక్యుమెంట్ల జీరాక్స్‌ను తెప్పించుకొని పేర్లు మార్పులు చేసి ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఇతరులకు విక్రయిస్తున్నారు. రైటర్స్, ఆపరేటర్లు, ఆధార్ నిర్వాహకులతో పాటు అసలు రైతు పేరు మ్యాచ్అయ్యేలా ఉన్న బంధువులు, స్నేహితులను కూడా ఇందులోకి లాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.