బద్రీనాథ్​ రహదారిపై విరిగిపడిన కొండ చరియలు.. పరుగులు తీసిన జనాలు

బద్రీనాథ్​ రహదారిపై విరిగిపడిన కొండ చరియలు.. పరుగులు తీసిన జనాలు

 ఉత్తర భాతరదేశాన్ని వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోతుంది. ఉత్తరాఖండ్ లోని చమోలీలో బద్రీనాథ్ రహదారిపై భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతుండడం అక్కడి స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తుంది. విరిగిపడిన కొండచరియల కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జోషిమఠంలోని చుంగిధార్ వద్ద ఈ ఘటన వెలుగుచూసింది. కొండచరియలపై నుండి పెద్ద పెద్ద రాళ్లు విరిగిపడడంతో స్థానికులు తమ ప్రాణాలను చేతిలో పట్టుకుని పరుగులు తీశారు. వాహనాలు కూడా ఒక్కసారిగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ తరుణంలో విరిగిపడుతున్న కొండచరియల వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ రహదారిపై ఇరువైపుల రాకపోకలు నిలిచిపోయాయి. వందల మంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


ప్రస్తుతం ( వార్త రాసే సమయానికి)  భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కొండచరియలపై నుండి విరిగిపడిన రాళ్లను రోడ్డుపై నుండి తొలగిస్తున్నారు. పోలీసులు భారీగా ఘటనా స్థలానికి చేరుకుని వాహనదారులను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే సిబ్బంది చేపట్టిన చర్యలు రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉందని సమాచారం. కాగా, గత కొంతకాలంగా ఉత్తరాదిని వర్షాలు ముంచెత్తాయి. దీంతో కొండలపై నుండి కొండచరియలు విరిగిపడుతున్నాయి. ముఖ్యంగా పర్యాటకులను ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని, వాహనదారులు కూడా అవసరం అయితేనే ఈ దారుల్లో ప్రయాణించాలని పోలీసులు సూచిస్తున్నారు.