సాయుధ దళాలలో (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) మహిళలకు సమాన గౌరవం, అవకాశాలు కల్పించేలా సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు ఇచ్చింది. మహిళా షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) అధికారులు కూడా పురుషులతో సమానంగా 'శాశ్వత కమిషన్' పొందేందుకు అర్హులని కోర్టు స్పష్టం చేసింది.
కోర్టు ఎం చెప్పిందంటే... మహిళా అధికారుల పట్ల సైన్యంలో వివక్ష కొనసాగుతోందని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. కేవలం పురుషులకే శాశ్వత కమిషన్ ఉంటుందనే పాత పద్ధతులను మార్చాలని చెప్పింది. శాశ్వత కమిషన్ కోసం ఏటా కేవలం 250 మంది మహిళలకే అవకాశం ఇవ్వాలనే నిబంధన సరికాదని, అది అన్యాయమని కొట్టివేసింది.
మహిళా అధికారుల పనితీరును అంచనా వేసే విధానం (ACR) సరిగ్గా లేదని, వారు ఎప్పటికీ శాశ్వత కమిషన్‌కు అర్హులు కారు అనే ముందస్తు అభిప్రాయంతో వారిని తక్కువ చేసి చూశారని కోర్టు పేర్కొంది.
షార్ట్ సర్వీస్ vs శాశ్వత కమిషన్:
షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఇందులో అధికారులు 10 నుంచి 14 ఏళ్లు మాత్రమే పనిచేస్తారు. పదవీ విరమణ తర్వాత వీరికి పూర్తి పెన్షన్ రాదు, పెద్ద హోదాల్లోకి వెళ్లే అవకాశం తక్కువగా ఉంటుంది.
శాశ్వత కమిషన్ (PC) ఇందులో రిటైర్మెంట్ వరకు అంటే సుమారు 20 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ పనిచేయవచ్చు. పూర్తి పెన్షన్ ప్రయోజనాలు ఉంటాయి, ఆర్మీలో అత్యున్నత పదవులను చేపట్టవచ్చు.
కీలక ఆదేశాలు:
2019, 2020, 2021 సంవత్సరాల్లో సెలెక్టెడ్ బోర్డుల ద్వారా పరిశీలించబడిన మహిళా అధికారులు 20 ఏళ్ల సర్వీసు పూర్తి చేసినట్లుగా పరిగణించబడతారు. వీరికి 1 నవంబర్ 2025 నుండి పెన్షన్ ప్రయోజనాలు అందుతాయి.
నేవీ : 2009 తర్వాత చేరిన మహిళా అధికారులందరికీ మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా శాశ్వత కమిషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఎంపిక ప్రక్రియలో పారదర్శకత ఉండాలని కూడా స్పష్టం చేసింది.
ఎయిర్ ఫోర్స్: సర్వీసు కాలాన్ని సాకుగా చూపి మహిళలకు ప్రయోజనాలను నిరాకరించకూడదని కోర్టు తెలిపింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తనకు ఉన్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్ది, దేశ సేవలో ఉన్న మహిళలకు సంపూర్ణ న్యాయం చేయడమే ఈ తీర్పు ముఖ్య ఉద్దేశ్యం.
