పరిహారం పెంచండి సారూ .. మిట్టపల్లి ఆర్వోబీ బాధితుల వేడుకోలు

పరిహారం పెంచండి సారూ .. మిట్టపల్లి ఆర్వోబీ బాధితుల వేడుకోలు
  • మార్కెట్ రేట్ కోసం డిమాండ్
  • ఆర్డీవో ఆఫీస వద్ద నిరసన

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట నుంచి వరంగల్ కు వెళ్లే 765 డీజీ నేషనల్  హైవే నిర్మాణంలో భాగంగా మిట్టపల్లి వద్ద  ఆర్వోబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి) నిర్మాణంతో నష్టపోతున్న బాధితులు తమకు  పరిహారం పెంచాలని  డిమాండ్ చేస్తున్నారు.  ప్రభుత్వం ఇస్తున్న పరిహారం సరిపోదని మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వాలని కోరుతున్నారు. మిట్టపల్లి వద్ద దాదాపు 1.2 కిలో మీటర్ల మేర రూ.55 కోట్లతో నిర్మించే ఆర్వోబీ నిర్మాణం కోసం 187 మందికి సంబంధించి 3.05 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఈ భూముల్లో నివాస, వాణిజ్య భవనాలతో పాటు ఖాళీ స్థలాలు ఉన్నాయి. 

సర్వీస్​ రోడ్డుతోనే సమస్య

మిట్లపల్లి ఆర్వోబీ వద్ద  సర్వీస్ రోడ్డు  కోసం అదనంగా భూమిని సేకరించడం ఇప్పుడు బాధితులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. మొదట సర్వీస్ రోడ్డు ప్రతిపాదన లేకుండానే 100 ఫీట్ల మేర రోడ్డు విస్తరణ చేయాలని మార్కింగ్  చేశారు. తర్వాత  సర్వీస్ రోడ్డు  కోసం  ప్రత్యేకంగా  మార్కింగ్ చేయడంతో  బాధితులు అధికంగా భూములు కోల్పోతున్నారు. ఆర్వోబీకి రెండు వైపులా 5.5 మీటర్ల మేర సర్వీస్ రోడ్డును నిర్మించడం కోసం రెవెన్యూ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం  ఎకరాకు రూ.15 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు పరిహారం నిర్ణయించారు. కానీ మార్కెట్​లో ఎకరా రూ.50 లక్షలు పలుకుతున్న భూములకు ఈ పరిహారం సరిపోదని బాధితులు వ్యతిరేకిస్తున్నారు.

ఆర్డీవో ఆఫీసు వద్ద నిరసన

మిట్టపల్లి వద్ద ఆర్వోబీ కోసం సేకరించే భూముల పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తూ ఇటీవల బాధితులు ఆర్డీవో ఆఫీసు వద్ద నిరసన తెలిపారు. గతంలో మిట్టపల్లిలో రెవెన్యూ అధికారులు  గ్రామ సభను ఏర్పాటు చేయగా భూములు కోల్పోతున్న వారు దీన్ని అడ్డుకుని నిరసన తెలిపారు. ఇటీవల పరిహారం నిర్ణయించి నోటీసులు జారీ చేయడంతో అధికారులు తమ గోడును పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్వోబీ కారణంగా భూమిని కోల్పోతున్న వారిలో గతంలో రైల్వే లైన్ కోసం భూములు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ప్రజా అవసరాల కోసం నిర్మిస్తున్న ఆర్వోబీకి తాము సహకరిస్తున్నా పరిహారం పెంచకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం ఇవ్వాలి

మిట్టపల్లి వద్ద రైల్వే  ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో నష్టపోతున్న బాధితులకు మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం చెల్లించాలి. ఆర్వోబీ వల్ల 500 గజాల భూమితో పాటు   జీవనాధారమైన పెట్రోల్ బంక్ లో కొంత భాగాన్ని  కోల్పోవాల్సి వస్తోంది. బాధితుల త్యాగాన్ని గుర్తించి మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం ఇస్తే కొంతలో కొంత మేలు జరుగుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయకుంటే బాధితులకు ఆత్మహత్యలే శరణ్యమవుతాయి.

చింతల శ్రీనివాస్, మిట్టపల్లి 

ఆర్వోబీ  నిర్మాణంతో నష్టపోతున్నా

మిట్టపల్లి వద్ద ఆర్వోబీ నిర్మాణం వల్ల తీవ్రంగా నష్టపోతున్నా.  సర్వీసు రోడ్డు వల్ల నా150 గజాల ప్లాట్ లో 22 గజాల స్థలాన్ని  కోల్పోవాల్సి వస్తోంది. దీని వల్ల  భూమి విలువ పడిపోతుంది. గతంలో రైల్వే లైన్ నిర్మాణం కోసం ఎకరం పొలాన్ని  పొగొట్టుకుని వచ్చిన పరిహారం డబ్బులతో ప్లాటు కొనుక్కుంటే ఇప్పుడు  ఆర్వోబీ నిర్మాణం  వల్ల అది కూడా పోయే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం మానవతా ధృక్పథంతో ఆలోచించి పరిహారం పెంచాలి.

‌‌‌‌‌‌‌‌జంపెల్లి యాదగిరి, మిట్టపల్లి