కంపెనీలు పెట్టకపోతే భూములు వాపస్ : మంత్రి శ్రీధర్​బాబు

కంపెనీలు పెట్టకపోతే భూములు వాపస్ :   మంత్రి శ్రీధర్​బాబు

హైదరాబాద్, వెలుగు: పరిశ్రమల  కోసం ప్రభుత్వం నుంచి భూములు తీసుకొని ఏళ్లు గడిచినా కంపెనీలు స్థాపించని సంస్థల నుంచి భూములు వాపస్​ తీసుకోవాలని అధికారులను మంత్రి శ్రీధర్​బాబు ఆదేశించారు. శనివారం హైదరాబాద్​లోని టీఎస్ఐఐసీ ఆఫీసులో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. వివిధ విభాగాల పనితీరు, ల్యాండ్​ బ్యాంక్, భూముల కేటాయింపులు, వాటి వినియోగం తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత పరిశ్రమలకు చేసిన భూకేటాయింపులపై సమీక్షించారు. తెలంగాణ ఏర్పడ్డాక ఏయే సంస్థలకు ఎంత భూమి ఇచ్చారు, ఆయా సంస్థలు ఏ అవసరాల కోసం భూమి తీసుకున్నాయి, 

వాటిని ఇప్పుడు ఎలా వినియోగిస్తున్నాయి, నిరుపయోగంగా ఉన్న భూములెన్ని వంటి విషయాలపై మంత్రి ఆరా తీశారు. భూములు తీసుకొని ఏళ్లు గడిచినా పరిశ్రమలు ఏర్పాటు చేయని సంస్థల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. థర్డ్​పార్టీకి లీజుకు ఇచ్చిన సంస్థలు ఏమైనా ఉంటే ఆ వివరాలు సమర్పించాలన్నారు. జిల్లాల్లో ప్రజాప్రతినిధులకు టీఎస్ఐఐసీ అధికారులు అందుబాటులో ఉండటం లేదన్న వార్తలు వస్తున్నాయని, అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.