కేదార్‌నాథ్ దారిలో విరిగిపడిన కొండచరియలు ..7,350 మంది యాత్రికుల తరలింపు

కేదార్‌నాథ్ దారిలో విరిగిపడిన కొండచరియలు ..7,350 మంది యాత్రికుల తరలింపు
  • 7,350 మంది యాత్రికుల తరలింపు.. కొనసాగుతున్న శిథిలాల తొలగింపు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో దెబ్బతిన్న కేదార్‌నాథ్ మార్గం నుంచి 7,350 మంది యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సోమవారం 7,200 మందిని, మంగళవారం మరో 150 మందిని రెస్క్యూ చేసినట్టు రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం (ఎస్ఈవోసీ) తెలిపింది. గౌరీకుండ్ సమీపంలోని చిర్బాసా హెలిప్యాడ్ వద్ద ఆదివారం భారీ బండరాళ్లు విరిగిపడటంతో కేదార్‌నాథ్ యాత్ర నిలిచిపోయింది.

ప్రస్తుతం మార్గాన్ని తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు కూలీలు యుద్ధప్రాతిపదికన శిథిలాలను తొలగిస్తున్నారు. పోలీస్, పీడబ్ల్యూడీ సిబ్బంది భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మార్గం పూర్తిగా క్లియర్ అయ్యే వరకు కేదార్‌నాథ్ వెళ్లే యాత్రికులను అనుమతించబోమని పోలీసులు తెలిపారు. సోన్‌ప్రయాగ్, గౌరీకుండ్ వద్ద ఆగిపోయిన యాత్రికులు అధికారులు ఇచ్చే సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.