
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం నిధులిస్తేనే మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన రిపేర్లు చేస్తామని 2019లోనే తేల్చిచెప్పామని ఎల్అండ్టీ సంస్థ బాంబు పేల్చింది. తాము కోరినా రిపేర్లకు సంబంధించిన డిజైన్లు, అవసరమైన నిధులను ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదని వెల్లడించింది. బ్యారేజీ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తయినందున దాని రిపేర్ల బాధ్యత తమది కానే కాదని తేల్చేసింది. ఈ మేరకు మేడిగడ్డ ఈఈకి పది రోజుల క్రితం ఎల్అండ్టీ సంస్థ లేఖ రాయగా బుధవారం అది వెలుగు చూసింది.
2019 వర్షాకాలంలో బ్యారేజీకి పోటెత్తిన వరదతో సీసీ బ్లాకులు చెల్లాచెదురయ్యాయి. నవంబర్‌లో బ్యారేజీ గేట్లు దించడంతో దిగువ భాగంలో సీసీ బ్లాకులు చాలా దూరం కొట్టుకుపోయినట్టుగా గుర్తించారు. కానీ ప్రాజెక్టు ఇంజనీర్లు వాటిని సరి చేయాలని తమను కోరనే లేదని ఎల్అండ్టీ లేఖలో పేర్కొన్నది. వర్షాకాలం ప్రారంభానికి రెండు వారాల ముందు అంటే 2020 మే 18న మేడిగడ్డ ఈఈ రిపేర్లు చేయాలని తమకు లేఖ రాశారని తెలిపింది. టీఎస్ఈఆర్ఎల్ స్టడీ ప్రకారం బ్యారేజీ నుంచి వరద వేగాన్ని తగ్గించడానికి కొత్తగా డిజైన్లు చేసి వాటికి అనుగుణంగా వేరింగ్కోట్స్, సీసీ అఫ్రాన్లు, స్టోన్అఫ్రాన్లు, డౌన్‌స్ట్రీమ్ అఫ్రాన్స్ట్రక్చర్ల పనులు చేపట్టాల్సి ఉందని అప్పుడే గుర్తించారు. ఆ పనులు చేపట్టాలని ప్రాజెక్టు అథారిటీ కోరినా ఎల్అండ్టీ అప్పుడే ససేమిరా అన్నది.
ప్రభుత్వ డిజైన్ల ప్రకారమే బ్యారేజీ నిర్మించామని, పునరుద్ధరణ పనులు తమ బాధ్యత కాదని స్పష్టం చేసింది. ఆ పనులు చేయాలంటే మళ్లీ వర్క్అగ్రిమెంట్చేసుకోవాలని చెప్తూ 2020 మే18న మేడిగడ్డ ఈఈకి లేఖ రాసింది. ఆ తర్వాత రిపేర్లకు సంబంధించిన డిజైన్లు ఇవ్వాలని ఆరు నెలలు లెటర్లు రాసినా ప్రభుత్వమే స్పందించలేదని తెలిపింది. అదే సమయంలో లాక్డౌన్ విధించడం, ప్రభుత్వం రీ డిజైన్లు, నిధులు ఇవ్వకపోవడంతోనే ఆ పనులు చేయలేదని వివరించింది.
2022లోనే మా బాధ్యత తీరింది..
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం కోసం ఇరిగేషన్డిపార్ట్మెంట్తో 2016 ఆగస్టు 26న వర్క్అగ్రిమెంట్చేసుకున్నామని, ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లకు లోబడే బ్యారేజీని నిర్మించామని లేఖలో ఎల్ అండ్ టీ స్పష్టం చేసింది. బ్యారేజీ నిర్మాణానికి సానుకూల వాతావరణం లేకున్నా, అనేక ప్రతిబంధకాలను అధిగమించి నిర్దేశిత సమయంలోనే పనులు పూర్తి చేశామన్నారు.
తాము పనులు పూర్తి చేసి నాలుగేళ్లు గడుస్తున్నా.. చేసిన పనులే చేయాలని కోరడం సరికాదని పేర్కొంటూ 2023 మే 17న మేడిగడ్డ ఈఈకి రాసిన లేఖలోనే స్పష్టం చేశామని తెలిపింది. 2019 జూన్21న మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించగా వరుసగా నాలుగేళ్లు భారీ వరదలను తట్టుకొని నిలిచిందని, 2022 జులై 13 నుంచి 16 మధ్య రికార్డు స్థాయిలో వరద వచ్చినా బ్యారేజీ తట్టుకొని నిలబడిందన్నారు. 2020 జూన్29న బ్యారేజీ నిర్మాణం పూర్తి చేశామని ఇంజనీర్లు సర్టిఫికెట్ఇచ్చారని, ఆ రోజు నుంచి రెండేండ్ల పాటు అంటే 2022 జూన్28న డిఫెక్ట్లయబిలిటీ పీరియడ్ పూర్తయిందని తేల్చిచెప్పింది. అయితే, బ్యారేజీ ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ (ఓ అండ్ఎం) పీరియడ్ మాత్రం2025 జూన్28 వరకు ఉందని తెలిపింది.
మళ్లీ అదనపు పనులు చేయలేం..
బ్యారేజీ నిర్మాణం పూర్తయిన నాటి నుంచి ఇటీవల కాలం వరకు రూ.9.70 కోట్లతో ఓ అండ్ఎం పనులు చేశామని.. ఆయా వివరాలను లేఖలో ప్రస్తావించింది. బ్యారేజీకి సంబంధించిన సివిల్, హైడ్రో మెకానికల్ పనులు 2019 జూన్21న పూర్తి చేశామని తెలిపింది. గైడ్‌బండ్స్, ఫ్లడ్బండ్స్, డైవర్షన్ చానళ్లు, కుదురుపల్లి నుంచి మేడిగడ్డ బ్యారేజీ వరకు అప్రోచ్ రోడ్డు, లెఫ్ట్ బ్యాంక్, రైట్‌బ్యాంక్, 3డీ మోడల్ స్టడీస్(లెఫ్ట్, రైట్బ్యాంకులవి) పనులు కూడా అదే రోజున పూర్తి చేశామని తెలిపింది.
ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో తాము చేసుకున్న అగ్రిమెంట్లో వీఐపీ గెస్ట్‌హౌస్, ఏఈఈ, డీఈఈ క్వార్టర్లు, కంట్రోల్ రూమ్‌కు అప్రోచ్‌రోడ్డు, గార్డ్‌రూమ్, ఫ్యాబ్రికేషన్ అండ్ఎరిక్షన్ఆఫ్గేట్స్ వంటి నిర్మాణాలు లేకున్నా ఆ పనులు కూడా చేశామని, అందుకు తాము రూ.7.50 కోట్లు ఖర్చు చేశామని తెలిపింది. అయినా మళ్లీ అదనపు పనులు చేయాలని కోరడం సరికాదని తేల్చిచెప్పింది. బ్యారేజీ పనులన్నీ పూర్తి చేశామని, అలాగే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్కూడా పూర్తయినందున బిల్లులు, అగ్రిమెంట్లు క్లోజ్చేయాలని కోరుతూ 2023 మే 17న లేఖ రాశామని కూడా గుర్తు చేసింది.