త్వరలో కాజీపేటలో జాతీయస్థాయి ఖోఖో పోటీలు

త్వరలో కాజీపేటలో జాతీయస్థాయి ఖోఖో పోటీలు
  • ఉనికిచర్లలో స్పోర్ట్స్ స్కూల్, మినీ స్టేడియం 
  • రాష్ట్ర ఖోఖో సంఘం అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి

హనుమకొండ, వెలుగు: త్వరలోనే రాష్ట్ర క్రీడా చరిత్రలో తొలిసారిగా సీనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ పోటీలను కాజీపేటలో నిర్వహించనున్నట్టు తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్, రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి వెల్లడించారు. వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం హనుమకొండలో ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎథిక్స్ కమిటీ కన్వీనర్ గా, సౌత్ జోన్ ఖోఖో అసోసియేషన్ చైర్మన్ ఎన్నికైన జంగా రాఘవరెడ్డి, కేకేఎఫ్ఐ ఉపాధ్యక్షుడు సీతారాంరెడ్డి, కార్యవర్గ సభ్యులు ఎన్.కృష్ణమూర్తి, ప్రసాద్ తదితరులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో ఖోఖోను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. జాతీయస్థాయి వేదికగా తెలంగాణ క్రీడాకారులు రాణించేందుకు దాదాపు రూ.12 లక్షలతో ఖోఖో మ్యాట్లను అందించినట్లు చెప్పారు. ఖోఖోతోపాటు మిగతా క్రీడల అభివృద్ధి కోసం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల సమీపంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో మినీ స్టేడియంతోపాటు క్రీడా పాఠశాలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ విషయమై త్వరలో సీఎం రేవంత్​రెడ్డిని క్రీడా సంఘాల ఆధ్వర్యంలో కలవనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి క్రీడా సంఘాలకు అందించాల్సి ఉన్న రూ.12 కోట్లను అందించేందుకు కృషి చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీతారామిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.