టార్గెట్ 100 డేస్ ..మున్సిపాలిటీల్లో స్పెషల్ డ్రైవ్

టార్గెట్ 100 డేస్ ..మున్సిపాలిటీల్లో స్పెషల్ డ్రైవ్
  • ట్రేడ్​ లైసెన్స్​ల జారీపై ఫోకస్ 
  • పన్నుల వసూళ్లపై నజర్​
  • ఆదాయ పెంపునకు కసరత్తులు

జనగామ, వెలుగు : మున్సిపాలిటీల పాలనను గాడిలోపెట్టేందుకు అధికార యంత్రాంగం కసరత్తులు పెంచింది. ప్రభుత్వ ఆదేశాలతో 100 రోజుల యాక్షన్​ ప్లాన్ తో ముందుకు సాగుతోంది. పారిశుధ్య నిర్వహణతో పాటు పన్నుల వసూళ్లు, ట్రేడ్​ లైసెన్స్​ల జారీలు చేపట్టి ఆదాయ పెంపునకు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్​ 2 నుంచి సెప్టెంబర్​ 10 వరకు నిర్వహిస్తున్న మున్సిపల్​ యాక్షన్​ ప్లాన్​ను ఉమ్మడి వరంగల్​జిల్లాలో పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.

ఆదాయ పెంపు పై ఫోకస్..​

మున్సిపల్​ ఆదాయాన్ని పెంచుకునేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతున్నారు. ఇండ్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాల అసెస్మెంట్ల పై దృష్టి సారించారు. గతంలో ఉన్న మేజర్​మెంట్లను మళ్లీ వెరిఫై చేస్తూ సరిచేస్తున్నారు. విస్తీర్ణం ఎక్కువగా ఉన్నవాటికి అసెస్మెంట్లను పెంచుతున్నారు. జనగామ మున్సిపల్​ పరిధిలో 2024-–25లో మొత్తంగా 1768 ట్రేడ్​ లైసెన్స్​లు ఉండగా, వాటి డిమాండ్​ రూ 28.13 లక్షలుగా ఉంది. కాగా, సదరు వ్యాపార, వాణిజ్య దుకాణాలను మరోసారి రీ మేజర్​మెంట్​ జరిపి ట్రేడ్​ లైసెన్స్​లు ఇచ్చారు. 

మున్సిపల్​ సిబ్బంది హాస్పిటల్స్, హోటల్స్, షోరూం బిల్డింగ్​లు, దుకాణాలు, వ్యాపార సముదాయాల వద్దకు చేరుకుని కొలతలు వేస్తున్నారు. గత మేజర్​మెంట్​కు ప్రస్తుత కొలతలకు తేడా ఉంటే అసెస్మెంట్లు పెంచేస్తున్నారు. అదేవిధంగా కొత్త దుకాణాలను తనిఖీ చేసి ట్రేడ్​ లైసెన్స్​లు జారీ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో 2025-–26కు ట్రేడ్​ లైసెన్స్​ల సంఖ్య 2125 కు పెరిగింది. 150 దుకాణాలకు రీ మెజర్​మెంట్లు వేశారు. కొత్తగా 357 ట్రేడ్​ లైసెన్స్ లు జారీ చేశారు.​ 

ఇదిలాఉండగా జనగామ మున్సిపల్​ పరిధిలో 15,574 అసెస్మెంట్​లు ఉండగా, ఇందులో 12,841 నివాస గృహాలు, 1,088 నివాసేర గృహాలు, 1,645 మిక్స్​డ్​ గృహాలున్నాయి. వీటి నుంచి పన్నుల రూపంలో రూ 567.64 లక్షల ఆదాయం అంచనాలు ఉన్నాయి. కాగా, భువన్​ సర్వేలో భాగంగా 2,730 ఇండ్లను రీ అసెస్మెంట్​ చేయగా, రూ.44.89 లక్షల డిమాండ్​ పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

పారిశుధ్యంపై చర్యలు..

జనగామ పట్టణంలో జనాభా లక్ష దాటింది. 30 వార్డులు ఉండగా, 161 మంది పారిశుధ్య కార్మికులు విధులు చేపడుతున్నారు. ప్రతీ నెల సుమారు 20 లక్షలకు పైగా శానిటేషన్​కు ఖర్చు చేస్తున్నారు. అయినా చెత్త సేకరణ మెరుగు పడడం లేదనే ఆరోపణలున్నాయి. మున్సిపల్​పాలకవర్గం లేకపోవడంతో స్పెషల్​ ఆఫీసర్​గా లోకల్​బాడీస్​అడిషనల్​కలెక్టర్​ పింకేశ్​కుమార్​ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పలుమార్లు రివ్యూలు చేపట్టి మున్సిపల్​ కమిషనర్​తో పాటు సిబ్బందిని అలర్ట్​ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుత 100 రోజుల యాక్షన్​ ప్లాన్​తో పాలన గాడిలో పెట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నిత్యం ఫీల్డ్​ విజిట్లు చేస్తూ స్టాఫ్​ను పరుగులు పెట్టిస్తున్నారు.

యాక్షన్​ప్లాన్​ను పటిష్టంగా అమలు చేస్తున్నం.. 

జనగామ మున్సిపల్​ పరిధిలో 100 రోజుల యాక్షన్​ ప్లాన్​ను పటిష్టంగా అమలు చేస్తున్నం. వ్యాపార వాణిజ్య సముదాయాల కొలతలు వేసి అసెస్మెంట్లు వేస్తున్నం. ఆదాయ మార్గాలపై దృష్టి సారించాం. పారదర్శకంగా ట్రేడ్​ లైసెన్స్​ల జారీని చేపడుతున్నం. పారిశుధ్య నిర్వాహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. మున్సిపల్​ పనితీరును మెరుగు పర్చేందుకు చర్యలు తీసుకుంటున్నం. - పింకేశ్​ కుమార్, అడిషనల్​ కలెక్టర్, జనగామ