
రాజకీయ నాయకుడు, న్యాయవాది, కవి, జర్నలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న చిత్తరంజన్ దాస్ 1870 నవంబర్5న కలకత్తాలో జన్మించాడు. భుబన్‌దాస్, నిస్తారిణీదేవీల మొదటికొడుకు. గొప్ప పేరు ప్రఖ్యాతులు గల నాగరిక కుటుంబాల్లో దాస్ కుటుంబం ఒకటి. తండ్రి వృత్తిరీత్యా ‘సోలిసిటర్’, వర్థమాన జర్నలిస్ట్, పాటల రచయిత. చిత్తరంజన్ కలకత్తాలోని లండన్ మిషనరీ సొసైటీ స్కూల్‌లో చదివాడు.
1886లో కలకత్తా యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ పాసయ్యాడు. ఆ తర్వాత ప్రెసిడెన్సీ కాలేజీలో చేరి, 1890లో బ్యాచిలర్ డిగ్రీ పొందాడు. తర్వాత ‘లా’ చదవడానికి ఇంగ్లాండ్‌కు వెళ్లాడు. అక్కడున్నప్పుడే ఐసీఎస్ కూడా ప్రయత్నించాడు.
1893లో ఇండియాకు తిరిగొచ్చి కలకత్తా హైకోర్ట్‌లో ‘బారిస్టర్’గా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. కానీ.. చాలా సంవత్సరాల వరకు సఫలీకృతుడు కాలేకపోయాడు. ఆ టైంలోనే తండ్రి ఆరోగ్యం క్షీణించింది. కుటుంబం అప్పుల పాలయ్యింది. దాంతో చాలా కష్టపడి అప్పులు తీర్చాడు. ఆ తర్వాత1897లో బసంతీదేవీతో పెండ్లి జరిగింది. అప్పుడే ఆయన కవితా సంపుటాలు మలంచా, మాల ప్రచురితమయ్యాయి. ఆయన చేసిన రచనలు కిషోర్‌కిషోరి, అంతర్యామిల్లో వైష్ణవ ప్రేమతత్వం కనిపిస్తుంది. చివరి సంవత్సరాల్లో కొన్ని భక్తి పాటలు కూడా రాశాడు.
చిత్తరంజన్‌కు దేశంలోని దాదాపు అన్ని సాహితీ ఉద్యమాలు, సంస్థలతో సంబంధం ఉంది.1915లో ‘బెంగాల్ సాహితీ సమావేశా’నికి అధ్యక్షత వహించాడు. ఆయన జర్నలిజానికి కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చేవాడు. 1906లో స్థాపించిన ‘బందే మాతరం’ డైలీ పేపర్ స్థాపకుల్లో చిత్తరంజన్ ఒకరు. దాని ఎడిటోరియల్ బోర్డ్‌లో కూడా సభ్యుడిగా ఉన్నాడు. తర్వాత ఫార్వర్డ్ అనే బెంగాల్ స్వరాజ్ పార్టీ అధికారిక దినపత్రికను, నారాయణ అనే మాస పత్రికను నెలకొల్పాడు.
ఒక లాయర్‌గా ఆయన 1908లో ‘బందే మాతరం’ ఎడిటర్ అరబిందో ఘోష్ కేసు విచారణలో కౌన్సిల్ ఫర్ డిఫెన్స్‌గా వెలుగులోకి వచ్చాడు. ఈ కేసు వల్ల ఆయనకు ఎంతో పేరొచ్చింది. ఆ తర్వాత చిత్తరంజన్‌కు మాణిక్ తుల్లా బాంబు కేసు వాదించే మరో గొప్ప అవకాశం దక్కింది. అది చరిత్రలో అత్యంత సంచలనాత్మకమైన రాజకీయ విచారణల్లో ఒకటి. ఏమాత్రం పారితోషికం తీసుకోకుండా వాదనలు వినిపించిన చిత్తరంజన్ ఫోరెన్సిక్ విషయ పరిజ్ఞానం, నైపుణ్యం, క్రాస్ ఎగ్జామినేషన్ బలంతో ఖ్యాతి పొందాడు. ఆ తర్వాత ఎక్కువ సంపాదించే లాయర్లలో ఒకరిగా ఎదిగాడు. ఆ టైంలో ఆయన సంవత్సర ఆదాయం 50 వేల పౌండ్ల దాకా ఉండేది.
చిత్తరంజన్ బెంగాల్ విభజనప్పుడు మొదలైన ఉద్యమంలోనూ పాల్గొన్నాడు. 1906లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో డెలిగేట్‌గా చేరాడు. 1917లో ఆయనను బెంగాల్ ప్రావిన్షియల్ కాన్ఫరెన్స్‌కు అధ్యక్షత వహించ వలసిందిగా కలకత్తాకు పిలిచారు. అలా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం జీవితాంతం కొనసాగింది. ఎన్నో కాన్ఫరెన్స్‌ల్లో ఉపన్యాసాలు ఇచ్చాడు.
చిత్తరంజన్ వామపక్షాన్ని సమర్థించడం వల్ల ఏర్పడిన చీలిక ‘లిబరల్‌పార్టీ’ ఏర్పాటుకు దారితీసింది. 1919లో అమృత్‌సర్ విషాదం జరిగింది. పంజాబ్‌లో మార్షల్‌లా ప్రవేశపెట్టారు. దాంతో పంజాబ్ వ్యవహారాల గురించి విచారణ చేయడానికి కాంగ్రెస్ ఒక కమిటీ వేసింది. అందులో చిత్తరంజన్ కూడా ఉన్నాడు. ఆ కమిటీ వల్లే ఆయన మొదటిసారి గాంధీజీని కలిశాడు. తర్వాత సత్యాగ్రహ ఉద్యమాన్ని సమర్థించాడు. ఆ తర్వాత కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నాడు.
చిత్తరంజన్1921లో ఢాకాలో నేషనల్ యూనివర్సిటీని స్థాపించాడు. అదే సంవత్సరంలో కాంగ్రెస్ సెషన్‌కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. కానీ.. ఆ టైంలో ఆయన అండర్ ట్రైల్ ఖైదీగా ఉండడం వల్ల అధ్యక్షత వహించలేకపోయాడు. 1922లో చిత్తరంజన్ జైలు నుంచి విడుదల అయ్యాడు.1924లో కలకత్తా కార్పొరేషన్‌కు మొదటి మేయర్‌గా ఎన్నికయ్యాడు.1925 జూన్16న ఆయన మరణించాడు. కలకత్తాలో మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో 3 లక్షల మంది మధ్య ఆయన అంతిమ సంస్కారాలు జరిగాయి.
- మేకల మదన్మోహన్ రావు, కవి, రచయిత