బెంగుళూర్: కర్నాటక సీఎం సిద్ధరామయ్య కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి సిద్ధరామయ్య రాజకీయ జీవితం చివరి దశలో ఉందని.. మా నాన్న రాజకీయ వారసుడిగా మంత్రి సతీష్ జార్కిహోళి కరెక్ట్ పర్సన్ అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మా నాన్న లాగే బలమైన భావజాలం, ప్రగతిశీల మనస్తత్వం కలిగిన వ్యక్తి సతీష్ జార్కిహోళి అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కర్నాటకలో త్వరలోనే నాయకత్వ మార్పు జరుగనుందని.. సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని జోరుగా ప్రచారం జరుగుతోన్న వేళ సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర వ్యాఖ్యలు కన్నడ పాలిటిక్స్‌లో కాకరేపుతున్నాయి.
బుధవారం (అక్టోబర్ 22) బెళగావిలో జరిగిన ఒక కార్యక్రమంలో యతీంద్ర మాట్లాడుతూ.. ‘‘నా తండ్రి సిద్ధరామయ్య రాజకీయ జీవితం చివరి దశలో ఉంది. కర్ణాటకకు ఇప్పుడు ప్రగతిశీల, ముందుచూపు గల నాయకుడు అవసరం. ఈ లక్షణాలు సతీష్ జార్కిహోళికి ఉన్నాయి. ఆయన ఈ బాధ్యతను స్వీకరించగల సమర్థుడు. జార్కిహోళి మనల్ని ఆదర్శంగా నడిపిస్తారని నాకు నమ్మకం ఉంది’’ అని యతీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.
►ALSO READ | చావు దెబ్బ తిన్న బుద్ధి మారలే: మరో భారీ కుట్రకు తెరలేపిన జైషే మహ్మద్
ఈ కార్యక్రమంలో మంత్రి సతీష్ జార్కిహోళి కూడా ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే.. యతీంద్ర వ్యాఖ్యలు కర్నాటకలో నాయకత్వ మార్పు వార్తలకు మరింత ఆజ్యం పోశాయి. మరోవైపు ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపాయి. యతీంద్ర వ్యాఖ్యలపై డీకే వర్గం మండిపడుతుంది. నాయకత్వ మార్పు అంశం అధిష్టానం పరిధిలోనే అంశమని.. యతీంద్ర ఇలా బహిరంగా వేదికలపై మాట్లాడటం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డీకే వర్గం నేతలు.
సిద్ధరామయ్య ప్రభుత్వం ఏర్పడి 2025, నవంబర్ నాటికి రెండున్నరేళ్లు పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో కర్నాటకలో నాయకత్వ మార్పు జరుగుతుందని.. సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ కర్నాటక సీఎం పగ్గాలు చేపడతారని కన్నడ పాలిటిక్స్‌లో జోరగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
